![]() |
![]() |

తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల ఆధారంగా కల్పిత కథతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు కొందరు పెదవి విరిచారు. అల్లూరి, కొమురం భీమ్ మన తెలుగు వారికి మాత్రమే తెలుసు.. అలాంటిది ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో రెస్పాన్స్ వస్తుందా అని సందేహం వ్యక్తం చేశారు. అయితే మెజారిటీ ప్రేక్షకులు మాత్రం రాజమౌళి ఏదో అద్భుతం చేస్తాడని నమ్మారు. ఊహించినట్లుగానే 'ఆర్ఆర్ఆర్'తో అద్భుతం చేశాడు రాజమౌళి. మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతోంది ఈ మూవీ. నార్త్ లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అక్కడ కొందరు ఆడియన్స్ అయితే 'రామరాజు' గెటప్ లో ఉన్న చరణ్ ని చూసి 'రాముడు' అనుకొని 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తున్నారు.
నార్త్ లో శ్రీరాముడి భక్తులు ఎక్కువగా ఉంటారు. శ్రీరాముడు కనిపిస్తే చాలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్ఆర్ఆర్ లో చిన్నపాటి రామాయణం చూపించినట్లున్నాడు రాజమౌళి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలలో రామాయణం అడుగడుగునా గుర్తుకొస్తుంది. రాముడిని సీత దగ్గరకు చేర్చుతానంటూ భీమ్ హనుమంతుడిలా లంక లాంటి బ్రిటీష్ కోటలోకి వెళ్తాడు. రాముడిని హనుమంతుడు భుజాలపై కూర్చోబెట్టుకున్నట్లుగా.. రామ్ ని భీమ్ భుజాలపై మోసుకొని వస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ లో రామ్ ని అల్లూరి గెటప్ లో చూపించి రోమాలు నిక్కబోడుచుకునేలా చేశాడు రాజమౌళి. రాముడి విగ్రహం దగ్గరున్న కాషాయ వస్త్రం, విల్లు, బాణాలతో అల్లూరి గెటప్ లోకి మారతాడు రామ్. అయితే అలా చూసినప్పుడు మనకి అల్లూరి గుర్తొస్తాడు.. కానీ నార్త్ వాళ్ళు అది రాముడి రూపం అని భావించి కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారట. అంతేకాదు హనుమంతుడు లంక తగలబెట్టినట్లుగా.. ఈ సినిమాలో భీమ్ బ్రిటీష్ కోటని తగలబెట్టినట్లు చూపించారు. ఇలా రామాయణం రిఫరెన్స్ లతో నార్త్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు రాజమౌళి.

నార్త్ లో ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రోజురోజుకి పుంజుకుంటున్నాయి. మొదటిరోజు హిందీలో 19 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా.. రెండో రోజు 24 కోట్లు, మూడో రోజు 31.50 కోట్లతో సత్తా చాటింది. మూడు రోజుల్లో 74.50 కోట్ల నెట్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ ముందు ముందు నార్త్ లో మరిన్ని అద్భుతాలు సృష్టించే అవకాశముంది.
![]() |
![]() |