![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ అంటేనే సాహసాలకు చిరునామా. కెరీర్ ఆరంభం నుంచి తనది అదే శైలి. కథానాయకుడిగా బుడి బుడి అడుగులు వేస్తున్న తరుణంలోనే ఎన్నో ప్రయోగాలు చేసి మెప్పించారాయన. అలా.. కృష్ణ చేసిన ప్రయోగాల్లో `గూఢచారి 116` ఒకటి. అంతవరకు తెలుగునాట ఏ కథానాయకుడు టచ్ చేయని స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో సూపర్ స్టార్ ఎంటర్టైన్ చేశారు. టైటిల్ రోల్ లో కృష్ణ నటించగా.. ఏజెంట్ 303గా నట భూషణ శోభన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించారు. ప్రముఖ నటీమణి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇందులో కథానాయికగా నటించగా.. రాజనాల, రేలంగి, రమణా రెడ్డి, రాజబాబు, గీతాంజలి, వెన్నిరాడై నిర్మల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఆరుద్ర రచన చేసిన ఈ సినిమాకి ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం వహించగా.. సుందర్ లాల్ నహతా, డూండీ సంయుక్తంగా నిర్మించారు. తెలుగునాట ఘనవిజయం సాధించిన `గూఢచారి 116`.. హిందీలో `ఫర్జ్` (జితేంద్ర, బబిత) పేరుతో రీమేక్ అయింది. తెలుగు వెర్షన్ కి ఛాయాగ్రహణం అందించిన రవికాంత్ నగాయిచ్.. హిందీ వెర్షన్ ని డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమాటోగ్రఫీ అందించారు.
టి. చలపతిరావు సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``నువ్వు నా ముందుంటే``, ``మనసు తీరా నవ్వులే``, ``ఎర్రబుగ్గల మీద మనసైతే``, ``డీరి డిరి డిరి డీరిడి`` గీతాలు ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలిచాయి. 1966 ఆగస్టు 11న విడుదలై అఖండ విజయం సాధించిన `గూఢచారి 116`.. నేటితో 55 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |