![]() |
![]() |

హుషారైన పాత్రలకు చిరునామాగా నిలిచిన మాస్ మహారాజా రవితేజ.. అప్పుడప్పుడు తన శైలికి భిన్నంగా సాఫ్ట్ రోల్స్ లోనూ కనిపించారు. అలా.. రవితేజ నటించిన చిత్రాల్లో `నా ఆటోగ్రాఫ్ - స్వీట్ మెమోరీస్` ఒకటి. తమిళ చిత్రం `ఆటోగ్రాఫ్` ఆధారంగా రూపొందిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాతో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి దర్శకుడిగా అవతారమెత్తారు. రవితేజకి జోడీగా గోపిక, మల్లిక, కనిక నటించిన ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకి స్ఫూర్తినిచ్చే ముఖ్య పాత్రలో భూమిక దర్శనమిచ్చారు.
కథ విషయానికొస్తే.. శీను (రవితేజ) అనే ఓ యువకుడి లైఫ్ జర్నీ ఇది. మూడు వేర్వేరు దశల్లో అతని జీవితంపై ప్రభావం చూపిన ముగ్గురు అమ్మాయిల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆ ముగ్గురు అమ్మాయిలుగా మల్లిక, గోపిక, భూమిక నటించగా.. శీనుని పెళ్ళాడే యువతిగా కనిక కనిపిస్తుంది. సునీల్, ప్రకాశ్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణు మాధవ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరవాణి కీరవాణి బాణీలతో రూపొందిన ఈ చిత్రంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. చంద్రబోస్ సాహిత్యంలో చిత్ర గానం చేసిన ``మౌనంగానే ఎదగమని`` ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే, ``మన్మథుడే``, ``గుర్తుకొస్తున్నాయి``, ``గామ గామ హంగామా``, ``దువ్విన తలనే``, ``నువ్వంటే ఇష్టమని`` గీతాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన `నా ఆటోగ్రాఫ్`.. 2004 ఆగస్టు 11న విడుదలై క్లాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. నేటితో ఈ సినిమా 17 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |