![]() |
![]() |

డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో తనకు ఇప్పటికే నిశ్చితార్ధం జరిగినట్లు లేడీ సూపర్‌స్టార్ నయనతార ధ్రువీకరించారు. కొంత కాలంగా ఆ ఇద్దరూ సహజీవనం చేస్తుండటంతో ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగివుంటుందనే ప్రచారం నడుస్తూ వుంది. ఇప్పుడు ఆ ప్రచారం నిజమేనని నయనతార చెప్పినట్లయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో త్వరలో విడుదల కాబోతున్న త సినిమా 'నేట్రికన్' ప్రమోషనల్ ఈవెంట్‌లో నయన్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.
విజయ్ టీవీలో యాంకర్ దివ్యదర్శిని చేసిన ఇంటర్వ్యూలో తన చేతికున్న ఉంగరాన్ని చూపించిన నయన్., అది తన ఎంగేజ్‌మెంట్ రింగ్ అని వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్వరలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ఈలోగా ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, నయన్ ఎంగేజ్‌మెంట్ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఏడాది మార్చిలో నయనతార తనపై వాలివున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు విఘ్నేశ్ శివన్. ఆ ఫొటోలో నయన్ వేలి వుంగరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫొటోకు "జీవితంతో వేలు ముడిపడి వుంది" అనే క్యాప్షన్ పెట్టాడు విఘ్నేశ్. తాము నిశ్చితార్ధం చేసుకున్న విషయాన్ని వాళ్లు బయటపెట్టకపోయినా, అప్పట్నుంచి వారి నిశ్చితార్ధంపై పలు ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి.
2015లో వచ్చిన 'నానుమ్ రౌడీ ధాన్' సినిమాకు కలిసి పనిచేసే టైమ్‌లో నయన్, విఘ్నేశ్ ప్రేమలో పడ్డారు. అప్పట్నుంచీ ఇద్దరూ లవ్ బర్డ్స్ మాదిరిగా విహరిస్తూ కనిపిస్తున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా నయన్‌తో విహరిస్తున్న, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ పోస్ట్ చేస్తున్నాడు విఘ్నేశ్. ప్రస్తుతం నయన్, సమంత హీరోయిన్లుగా, విజయ్ సేతుపతి హీరోగా 'కాదు వాకుల రెండు కాదల్' సినిమాని విఘ్నేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
![]() |
![]() |