![]() |
![]() |

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అప్పట్లో మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ప్లాన్ చేశాడు. అవి శైలేష్ కొలను దర్శకత్వంలో 'విశ్వంభర', ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'రావణం', ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో 'జటాయు'. ప్రస్తుతం 'విశ్వంభర' టైటిల్ తో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. శైలేష్ కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో 'రావణం' ఇప్పట్లో సాధ్యంకాదని.. ఆ సమయంలోనే అందరూ భావించారు. ఇక 'జటాయు' గురించి మాత్రం అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని బాగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రభాస్ పేరు తెరపైకి వచ్చింది. (Prabhas In Jatayu)
'గేమ్ ఛేంజర్'తో పాన్ ఇండియా ఆశలు నెరవేరకపోవడంతో.. మరో భారీ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని దిల్ రాజు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన 'జటాయు'ను ప్రభాస్ తో చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మైథలాజికల్ టచ్ ఉన్న కథ కావడంతో.. ప్రభాస్ సైతం ఈ ప్రాజెక్ట్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే క్రేజీ ప్రాజెక్ట్ కి దర్శకుడు మారనున్నాడట. ఇంద్రగంటి ఇచ్చిన కథను తీసుకొని, వేరే దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారట.
'జటాయు' దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ఒక సినిమా కమిటై ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ చూపు తమిళ దర్శకుడు అట్లీ వైపు కూడా ఉంది. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై క్లారిటీ లేదు. అందుకే దిల్ రాజు చూపు త్రివిక్రమ్ పై పడినట్లు తెలుస్తోంది. పైగా త్రివిక్రమ్ కి పురాణాలపై ఎంతో పట్టు ఉంది. 'జటాయు' లాంటి మైథలాజికల్ కథకి.. త్రివిక్రమ్ అయితేనే న్యాయం చేయగలడని దిల్ రాజు భావిస్తున్నాడట. త్రివిక్రమ్ ఓకే అంటే.. హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి 'జటాయు'ను నిర్మించాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి.
ఒకవేళ 'జటాయు' చేయడానికి త్రివిక్రమ్ ముందుకు రాకపోతే.. సురేందర్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశముంది అంటున్నారు. ఎందుకంటే 'జటాయు' తరహాలోనే 'గరుడ' అనే ఒక భారీ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో సురేందర్ ఎప్పటినుంచో ఉన్నాడు. అలాగే ప్రభాస్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక మూవీ చేయాలని గతంలో దిల్ రాజు ప్లాన్ చేశాడు. పైగా సురేందర్ కి 'సైరా నరసింహారెడ్డి' వంటి హిస్టారికల్ ఫిల్మ్ చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే త్రివిక్రమ్ కాకపోతే.. 'జటాయు' బాధ్యతను సురేందర్ రెడ్డికి అప్పగించాలని దిల్ రాజు చూస్తున్నాడట. మరి 'జటాయు' కోసం త్రివిక్రమ్, సురేందర్ రెడ్డిలో ఎవరు రంగంలోకి దిగుతారో చూడాలి.
![]() |
![]() |