![]() |
![]() |
సినిమాల్లో నటించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. వారి కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే.. వారికి అవకాశాలు రావడం, నిలదొక్కుకోవడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అయితే కొందరు మాత్రం తమకు ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని వారు కోరుకున్న గోల్‌ని రీచ్ అవుతారు. ఇప్పుడు స్టార్ హీరోలుగా, స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అలాంటి ఓ చేదు అనుభవం నటి అశ్విని నంబియార్ ఎదుర్కొన్నారు. తన అసలు పేరు రుద్ర. కానీ, స్క్రీన్‌కి ఆ పేరు బాగుండదని అశ్వినిగా మార్చుకుంది. మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించిన అశ్విని.. జయసుధ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆంటీ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిట్లర్, పెళ్లిచేసుకుందాం, పోలీస్ వంటి సినిమాల్లో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. సినిమా రంగం తనకు అచ్చిరాలేదని గ్రహించిన అశ్విని.. బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. తమిళ్, మలయాళ, తెలుగు భాషల్లో దాదాపు 30 సీరియల్స్ నటించారు అశ్విని. తెలుగు టీవీలో ఆమెను స్టార్‌ను చేసిన సీరియల్స్ కళంకిత, అంతరంగాలు.
సినిమాలకు దూరంగా ఉన్నా 2007 వరకు టీవీ సీరియల్స్‌లో నటించింది. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా, టీవీ రంగాల్లో రీ ఎంట్రీ ఇవ్వతోంది. ఆ మధ్య కొన్ని షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ చేసిన అశ్విని.. ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. ఓ ప్రముఖ దర్శకుడు అశ్వినికి మలయాళంలో తొలి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రెండో సినిమాకి కూడా ఆమెను బుక్ చేశాడు. ఒకరోజు సినిమా కథ గురించి చెబుతానని ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఎక్కడికి వెళ్లినా తల్లిని తీసుకెళ్లే అశ్విని ఆరోజు ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల తన హెయిర్‌డ్రెస్సర్‌ని తీసుకొని ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్లింది. ఆ హెయిర్ డ్రెస్సర్‌ని కిందే ఉండమని చెప్పి అశ్వినిని పైకి పిలిచాడు ఆ డైరెక్టర్. అతని గదిలోకి వెళ్లగానే ఆమెతో తప్పుగా మాట్లాడడమే కాకుండా, ఆమెను అసభ్యంగా టచ్ చేశాడు. దీంతో కంగారు పడిపోయి అక్కడి నుంచి వేగంగా బయటికి వచ్చేసింది. అప్పటికి ఆమె టీనేజర్ కావడంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియలేదట. ఇంటికి వచ్చిన తర్వాత విషయం తల్లికి చెబితే ఆమె ఎంతో బాధ పడ్డారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. తన తల్లి దు:ఖానికి కారణం తానేనని భావించి ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది అశ్విని. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అలా మృత్యువు నుంచి తప్పించుకుంది అశ్విని. ఆ తర్వాత పరిస్థితి సర్దుకోవడం, ఎవరి దగ్గర ఎలా మసలుకోవాలి అనే విషయాలను తల్లి నుంచి నేర్చుకున్న అశ్విని తన కెరీర్‌ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించింది. సినిమా, టీవీ రంగాల్లో విశేషంగా పేరు తెచ్చుకుంది. అయితే తను ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమైన డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు అశ్విని.
![]() |
![]() |