![]() |
![]() |

మూవీ : క్రూ
నటీనటులు: టబు, కృతి సనన్, కరీనాకపూర్ ఖాన్, దిల్జిత్ దొసాంజె, కపిల్ శర్మ, రాజేశ్ శర్మ, స్వాస్థ చటర్జీ, ఇవాన్ రోడ్రిగస్ తదితరులు
రచన : నిధి మెహ్ర, మెహుల్ సూరి
సినిమాటోగ్రఫీ: అనుజ్ రాజేశ్ ధావన్
మ్యూజిక్: దిల్జిత్ దోసాంజ్, బాధ్షా
ఎడిటింగ్: మనన్ సాగర్
దర్శకత్వం : రాజేశ్ ఏ కృష్ణన్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
కథ:
గీతూ సేథీ, జాస్మిన్ కోహ్లి, దివ్య రాణా అనే ముగ్గురు అమ్మాయిలు కోహినూర్ ఎయిర్‌లైన్స్ లో పని చేస్తుంటారు. ఆ ఎయిర్‌లైన్స్ యజమాని అయినటువంటి విజయ్ వాల్యా వల్ల అది తీవ్ర నష్టాల్లోకి వెళ్తుంది. దాంతో అందులో పనిచేసే సిబ్బందికి సరైన జీతాలు కూడా అందవు. ఇక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన గీతూ, జాస్మిన్, దివ్య రాణా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి డీల్ కుదుర్చుకుంటారు. అలా వాళ్ళు సక్సెస్ ఫుల్ గా స్మగ్లింగ్ చేస్తుండగా ఒకరోజు వారు పనిచేసే కోహినూర్ ఎయిర్‌లైన్స్ దివాళ తీసినట్లు ప్రకటిస్తుంది. దాంతో అందులో పనిచేసే సిబ్బంది రోడ్డున పడతారు. ఆ సంస్థ యజామని అయినటువంటి విజయ్ పాల్య విదేశాలకు పారిపోతాడు. గీతూ, జాస్మిన్, దివ్యలు ఏం చేసారు? విజయ్ పాల్య విదేశాలకు ఎందుకు పారిపోయాడో తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లోని ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారాణ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిలు సొంతంగా జాబ్ చేస్తుండగ.. ఒకరోజు సడన్ గా వారి లైఫ్ రోడ్డున పడటంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఇక కడుపు మండి వారు చేసిన పనులు ఆద్యంతం నవ్వులు కురిపించాయి. అయితే అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు రాజేశ్ ఏ కృష్ణన్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.
పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడనిపిస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ లో వారు వేసే ప్లాన్స్ ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో వేలకోట్లు అప్పు తీసుకొని విదేశాలకి ఎంతోమంది పారిపోయారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేక ఇండియాలోని పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ మీద బ్యాంకులు వేసే ట్యాక్స్ లు మాములు అయిపోయాయి. ఇలాంటి ఓ పాయింట్ ని తీసుకొని కథనం నడిపించిన తీరు బాగుంది. అయితే సినిమాలో మైనస్ అనిపించేదేదంటే.. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు కలిసి వేలకోట్లున్న విజయ్ పాల్యాని ఇండియాకి తీసుకురావడం. ఇక అదొక్కటి తప్పితే మిగతాదంతా ఒకే. అలా సాగిపోతుంది. స్క్రీన్ ప్లే అదనపు బలాన్నిచ్చింది.
ప్రథమార్ధంలో కథనం కాస్త నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ కి గాడిన పడుతుంది. అక్కడి నుండి ఆ ముగ్గురు విదేశానికి వెళ్ళడం, విజయ్ పాల్యా దిగిన హోటల్ లోనే స్టాఫ్ గా పనిచేయడం.. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా కామెడీగా సాగుతాయి. అయితే అక్కడక్కడ కాస్త బోల్డ్ సీన్స్ ఉంటాయి. అవి స్కిప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద వీరి ముగ్గురి నటనకి ప్రేక్షకులు ఫిధా అవుతారు. క్లైమాక్స్ విషయంలో కాస్త లాజిక్ మిస్ అయింది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. మ్యూజిక్ పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
గీతూ సేథి గా టబు, జాస్మిన్ కోహ్లిగా కరీనాకపూర్ ఖాన్, దివ్య రాణాగా కృతి సనన్ మూవీకి ప్రధాన బలంగా నిలిచారు. విజయ్ వాల్యాగా స్వాస్థ్ ఛటర్జీ ఒదిగిపోయాడు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కామెడీతో పాటు మెసెజ్ ఇచ్చే ఎంటర్‌టైనర్
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |