![]() |
![]() |

వాయిదా పడుతుందనుకున్న 'భీమ్లా నాయక్' మూవీ, ఊహించని విధంగా ఫిబ్రవరి 25 నే విడుదల కానుందని ప్రకటన రావడంతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'ఖుషీ' అవుతున్నారు. అయితే భీమ్లా నాయక్ రాక కొందరు యంగ్ హీరోలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా శర్వానంద్ సినిమాపై భీమ్లా నాయక్ ప్రభావం పడనుంది.
'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదల కావడం కష్టమనే వార్తల నేపథ్యంలో.. 'గని' సినిమాతో వరుణ్ తేజ్, 'సెబాస్టియన్'తో కిరణ్ అబ్బవరం అదే తేదీకి ప్రేక్షకులను పలకరించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా 'ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ విడుదల' అని ప్రకటన రావడంతో అందరూ షాక్ అయ్యారు. 'గని', 'సెబాస్టియన్' సినిమాలు వాయిదా పడే అవకాశముందని, ఆ రెండు సినిమాలు కొత్త విడుదల తేదీని వెతుక్కునే పనిలో ఉన్నాయని అంటున్నారు. కానీ శర్వానంద్ సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' పరిస్థితి భిన్నంగా ఉంది.
శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఈ సినిమాని ఫిబ్రవరి 25 న విడుదల చేస్తామని ముందు నుంచే మూవీ టీమ్ చెబుతూ వచ్చింది. టీజర్, పోస్టర్స్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ కూడా ఏర్పడింది. మూవీ టీమ్ ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబడుతుందని భావించారంతా. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సడెన్ ఎంట్రీ ఈ సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అయితే గతంలో 'ఎక్స్ ప్రెస్ రాజా', 'శతమానం భవతి' వంటి సినిమాలను స్టార్ హీరోల సినిమాలకు పోటీగా విడుదల చేసి శర్వానంద్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో శర్వానంద్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |