![]() |
![]() |

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అనుభవించు రాజా'. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాలో కషిష్ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ ని బట్టి చూస్తే 'అనుభవించు రాజా' మూవీ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. విలేజ్ లో కోడి పందాలు, గొడవలు అంటూ తిరిగే కుర్రాడు.. సిటీలో ఓ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా ఎందుకు మారాల్సి వచ్చింది? అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా ట్రైలర్ కట్ చేశారు. రాజ్ తరుణ్ మార్క్ కామెడీ కనిపిస్తోంది. రాజ్ తరుణ్-హీరోయిన్ కషిష్ ఖాన్, రాజ్ తరుణ్- విలన్ అజయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయన్న నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.
నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ లో నాగార్జున ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి. హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లో థియేటర్ దగ్గర నాగార్జున కటౌట్ ముందు డ్యాన్స్ చేస్తూ డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించాడు. ఇక 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్రలో మెప్పించిన నాగార్జున ఇప్పుడదే టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'అనుభవించు రాజా' సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర పేరు కూడా 'బంగార్రాజు' అని తెలుస్తోంది. ట్రైలర్ లో విలేజ్ లో 'బంగారం'గా, సిటీలో 'రాజు'గా కనిపించాడు రాజ్ తరుణ్.
గతంలో రాజ్ తరుణ్, శ్రీనివాస్ గవిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' నిరాశపరిచినప్పటికీ.. ఈ సినిమాతో విజయాన్ని అందుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు. అదీ గాక అన్నపూర్ణ బ్యానర్ లోనే 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా ఎంట్రీతోనే హిట్ కొట్టాడు రాజ్ తరుణ్. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ మళ్ళీ అన్నపూర్ణ బ్యానర్ సెంటిమెంట్ తో కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
![]() |
![]() |