![]() |
![]() |

నటునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదహారేళ్లు అయినా, తనకు సొంత ఇల్లు లేదనీ, ఇప్పటికీ తన తల్లితండ్రుల ఇంట్లోనే నివసిస్తున్నాననీ హీరో విశాల్ వెల్లడించాడు. మంగళవారం బెంగళూరులో కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేసిన దివంగత పునీత్ రాజ్‌కుమార్ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. ఈ కార్యక్రమంలో దక్షిణాది చిత్రసీమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ హాజరయ్యాడు.
పునీత్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడిన విశాల్, "పునీత్ మృతివార్త తెలిసినప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఎప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే ఆయన ముఖమే నా కళ్లముందు మెదులుతోంది. పునీత్‌తో వ్యక్తిగతంగా నాకంత అనుబంధం లేకపోయినా, ఆయనకు నేను అభిమానిని. ఆయన దివంగతుడయ్యే దాక ఆయన చేస్తున్న మంచి పనుల గురించి నాకు తెలీదు. అలాంటి గొప్ప మనిషి చేసిన సేవా కార్యక్రమాల్లో నేను కూడా భాగం కావాలనుకుంటున్నాను. ఇదివరకు చెప్పినట్లే ఆయన చదివిస్తూ వచ్చిన 1800 మంది పిల్లలను ఇక నుంచీ నేను చదివిస్తాను. వారి చదువులకయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను." అని చెప్పాడు.
తాను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లయ్యిందని తెలిపిన విశాల్, "ఇప్పటివరకూ నాకు సొంత ఇల్లు లేదు. మా అమ్మానాన్నల దగ్గర వాళ్లింట్లోనే ఉంటున్నాను. సొంత ఇల్లు కట్టుకోవాలని ఇంతదాకా నేను కూడబెట్టిన డబ్బును ఇకనుంచీ పిల్లల చదువు కోసం వెచ్చిస్తాను. ఇందుకు పునీత్ ఆత్మ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నా." అని అన్నాడు.
![]() |
![]() |