![]() |
![]() |

తరాలు మారినా తరగని వినోదాలు పంచే సినిమాలు కొన్ని ఉంటాయి. మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన మల్టిస్టారర్ `గుండమ్మ కథ` కూడా అచ్చంగా ఆ తరహా చిత్రమే. `గుండమ్మ`గా సూర్యకాంతం టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా మహానటి సావిత్రి అలరించగా.. ఏయన్నార్ కి జోడీగా అందాల తార జమున సందడి చేశారు. ఎస్వీ రంగారావు మరో ప్రధాన పాత్ర పోషించారు. సవతి తల్లి మూలంగా బాధలు పడే ఓ యువతిని కాపాడి.. ఆ సవతి తల్లికి గుణపాఠం చెప్పడమన్నదే `గుండమ్మ కథ` చిత్ర కథాంశం. కన్నడ చిత్రం `మనె తుంబిద హెణ్ణు` (1958) ఆధారంగా కమలాకర కామేశ్వరరావు రూపొందించిన ఈ ఫ్యామిలీ డ్రామాని.. విజయ వాహిని స్టూడియోస్ పతాకంపై బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు.
రాజనాల, రమణారెడ్డి, హరనాథ్, ఎల్. విజయలక్ష్మి, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య, హేమలత, రుష్యేంద్రమణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `గుండమ్మ కథ`కి చక్రపాణి, డి.వి. నరసరాజు స్క్రీన్ ప్లే సమకూర్చారు. మార్కస్ బార్ట్ లే ఛాయాగ్రహణం ఈ ఎవర్ గ్రీన్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఘంటసాల మాస్టర్ బాణీలు కట్టిన ఈ చిత్రానికి పింగళి పదరచన చేశారు. ``లేచింది నిద్ర లేచింది``, ``సన్నగా వీచే``, ``అలిగిన వేళనే చూడాలి``, ``ఎంత హాయి``, ``ప్రేమ యాత్రలకు``, ``మనిషి మారలేదు``, ``కోలో కోలోయన్న``, ``మౌనంగా``.. ఇలా ఇందులోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. 1962 జూన్ 7 విడుదలై అఖండ విజయం సాధించిన `గుండమ్మ కథ`.. మంగళవారంతో 60 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |