![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని గత చిత్రం 'శ్యామ్ సింగ్ రాయ్' విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. సమోసా, పార్కింగ్ రేట్లు కంటే సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉండటంపై పలువురు ఫైర్ అయ్యారు. అదే టైంలో 'ఇది ప్రేక్షకులను అవమానించడమే' అంటూ నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏపీ అధికార పార్టీ నేతలు నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాజాగా నాని మరోసారి టికెట్ రేట్ల అంశంపై స్పందించాడు.
విన్నతులు, విమర్శలతో దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం టికెట్ ధరలను పెంచింది. అంతేకాదు తెలంగాణతో పాటు ఏపీలో కూడా పెద్ద సినిమాలకు కొద్దిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు లభిస్తోంది. అయితే ఈ పెంచుతున్న ధరల కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గిపోతున్న నేపథ్యంలో.. తమ సినిమాలకి ధరలు పెంచట్లేదు, సాధారణ ధరలతోనే విడుదల చేస్తున్నామని హీరోలు, నిర్మాతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కొందరు నానిని టార్గెట్ చేస్తూ 'అధిక టికెట్ ధరలు ప్రేక్షకులను అవమానించడం కాదా?' అని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో నాని దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు.
నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికీ' సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్స్ అంశంపై కొందరు నానిని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నాని.. "నేనేమి టికెట్ ధర రూ.500 చేయమని చెప్పలేదు. రూ.20, రూ.40 ధరలతో సినీ పరిశ్రమ మనుగడ సాధించలేదని మాత్రమే చెప్పా. మితిమీరిన ధరలు ఉండకూడదు, అలాగే మరీ తక్కువ ధరలు ఉండకూడదు." అని అన్నాడు.
నాని వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పుడు టికెట్ రేట్స్ మరీ దారుణంగా ఉండటంతోనే నాని అలా మాట్లాడాడని, అలాగే ఇప్పుడు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని అధిక టికెట్ ధరలను కూడా వ్యతిరేకిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. అటు సినీ పరిశ్రమకి, ఇటు ప్రేక్షకులకు ఆమోదయోగ్యమైన ధరలు ఉంటే ఏ గోలా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |