![]() |
![]() |

వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ.. అప్పుడప్పుడు రీమేక్స్ తోనూ ఎంటర్టైన్ చేశారు. అలా ఈవీవీ తీసిన రీమేక్స్ లో `నేను ప్రేమిస్తున్నాను` ఒకటి. మలయాళ చిత్రం `అనియతిప్రావు` (కుంచకో బోబన్, షాలిని) ఆధారంగా రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో జేడీ చక్రవర్తి, రచన (తొలి తెలుగు చిత్రం) జంటగా నటించారు. కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, శరత్ బాబు, శ్రీ విద్య, బ్రహ్మానందం, చలపతి రావు, శ్రీహరి, సుధ, సన, రజిత, కల్పనా రాయ్, బేసంట్ రవి, ప్రకాశ్, వేణుమాధవ్, గణేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఫాజిల్ కథకి పోసాని కృష్ణమురళి సంభాషణలు, ఈవీవీ స్క్రీన్ ప్లే సమకూర్చారు.
శిర్పి సంగీతమందించిన ఈ చిత్రానికి `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్ సాహిత్యమందించారు. పాటల్లో ``కోవెల్లో దీపంలా`` విశేషాదరణ పొందగా.. ``లూలీ లూలీ``, ``బేబీ బేబీ``, ``అందరి ముందర``, ``ప్రేమా దీవించుమా``, ``ప్రేమతో నిను`` అంటూ మొదలయ్యే పాటలు కూడా రంజింపజేశాయి. జయశ్రీ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై సి.హెచ్. ఆర్. బి. చౌదరి నిర్మించిన `నేను ప్రేమిస్తున్నాను`.. 1997 జూన్ 6న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ మ్యూజికల్ హిట్ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |