![]() |
![]() |

తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఎస్. ఎస్. రాజమౌళి. మరీముఖ్యంగా.. `బాహుబలి` సిరీస్ తో పలు సంచలనాలు సృష్టించారాయన. 2015లో వచ్చిన `బాహుబలి - ద బిగినింగ్` తెలుగునాట సరికొత్త రికార్డులు సృష్టించి పరభాషల్లోనూ విజయకేతనం ఎగురవేస్తే.. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన `బాహుబలి - ద కంక్లూజన్` (2017) అంతకుమించిన విజయం సాధించి జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించింది. కనీవినీ ఎరుగని వసూళ్ళతో విస్మయపరిచింది. అలాగే, విజువల్ వండర్ గా చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా.. పాన్ - ఇండియా మూవీస్ ట్రెండ్ కి ఊపు తీసుకువచ్చింది. అలాంటి `బాహుబలి - ద కంక్లూజన్` విడుదలై నేటికి (ఏప్రిల్ 28) సరిగ్గా ఐదేళ్ళు.
ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్న `బాహుబలి - ద కంక్లూజన్`కి కీరవాణి బాణీలు, నేపథ్యసంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం, ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాణ విలువలు, స్పెషల్ ఎఫెక్ట్స్.. `బాహుబలి - ద కంక్లూజన్`కి ఎస్సెట్ గా నిలిచాయి. `బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్`, `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్`, `బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్` విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందుకుని వార్తల్లో నిలిచింది `బాహుబలి - ద కంక్లూజన్`. అలాగే, పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. మొత్తంగా.. తెలుగు సినిమా దశ, దిశని మార్చివేసిన సంచలన చిత్రంగా `బాహుబలి - ద కంక్లూజన్` చరిత్రలో నిలిచిపోయింది.
![]() |
![]() |