![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు పలు మల్టిస్టారర్స్ లో కలిసి సందడి చేశారు. వాటిలో 1978 నాటి `రామ కృష్ణులు` ఒకటి. హిందీ చిత్రం `హెరా ఫెరీ` (1976) (అమితాబ్ బచ్చన్ - వినోద్ ఖన్నా) ఛాయలతో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రముఖ దర్శకనిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ కి జంటగా జయసుధ నటించగా, ఏయన్నార్ కి జోడీగా జయప్రద కనువిందు చేశారు. సత్యనారాయణ, మోహన్ బాబు, అల్లు రామలింగయ్య, రాజబాబు, జగ్గయ్య, కాంతారావు, అంజలీ దేవి, పుష్పలత, ధూళిపాల, ముక్కామల, శరత్ బాబు, చలపతి రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలకు ఆచార్య ఆత్రేయ సాహిత్యమందించారు. ``అబ్బబ్బో ఆడవాళ్ళు``, ``కన్నె ఎవరో``, ``హరే రామ హరే కృష్ణ``, ``నవనవలాడే చినదానా``, ``దుప్పట్లో దూరాక``, ``జుయ్ జుయ్ అంటుంటే``, ``ఆడనా పాడనా`` అంటూ మొదలయ్యే ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన `రామ కృష్ణులు`.. 1978 జూన్ 8న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 44 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |