![]() |
![]() |

రెబల్ స్టార్ కృష్ణంరాజు, అందాల తార జయప్రద జంటగా రూపొందిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అమితంగా రంజింపజేశాయి. వాటిలో `టాక్సీ డ్రైవర్` ఒకటి. ఎస్పీ చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మోహన్ బాబు, రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, సారథి, హేమసుందర్, పండరీ బాయి, సువర్ణ, అత్తిలి లక్ష్మి, జయవాణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎండీ సుందరం కథను అందించగా.. కాశీ విశ్వనాథ్ సంభాషణలు సమకూర్చారు.
సత్యం సంగీతమందించిన ఈ చిత్రానికి దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``నా ప్రేయసి.. ఊహలో ఊర్వశి`` అంటూ సాగే గీతం విశేషాదరణ పొందగా.. ``హాటు హాటు హాటు అందగాడా``, ``తెలుసునా నీ సరి``, ``చలిజ్వరం``, ``ఎదలో ఎన్ని కథలో`` వంటి పాటలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. `విశ్వచిత్ర సినీ ఎంటర్ప్రైజెస్` పతాకంపై జీఆర్కె రాజు నిర్మించిన `టాక్సీ డ్రైవర్`.. 1981 జూన్ 12న విడుదలై కృష్ణంరాజు అభిమానులను అలరించింది. నేటితో ఈ సినిమా 40 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |