
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జీవో ఇచ్చింది. అందులో ఐదు షోలు, పెద్ద సినిమాలకు ప్రత్యేక టికెట్ ధరలు వంటి వాటికి ఓకే చెప్పిన ప్రభుత్వం కండీషన్స్ పెట్టింది. రెమ్యునేషన్స్ కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్ అయిన సినిమాలు పదిరోజుల పాటు ప్రత్యేక ధరలకు టికెట్స్ అమ్ముకోవచ్చని చెప్పింది. కానీ ఆ సినిమా షూటింగ్ కనీసం 20 శాతం ఏపీలో జరిగుండాలని మెలిక పెట్టింది. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలకు ఇబ్బందికరంగా మారింది. రీసెంట్ గా విడుదలైన 'రాధేశ్యామ్' మూవీది కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆర్ఆర్ఆర్' దర్శక నిర్మాతలు రాజమౌళి, డీవీవీ దానయ్య సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ విషయాలను తాజాగా రాజమౌళి పంచుకున్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి మీడియాతో ముచ్చటించిన రాజమౌళి ఏపీ సీఎం జగన్ తో భేటీ వివరాలను తెలియజేశారు. "కొత్తగా జీవో వచ్చింది కానీ, గైడ్ లైన్స్ పై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. మేం కలిసినప్పుడు సీఎం గారు రిసీవ్ చేసుకున్న విధానం, హామీ ఇచ్చిన విధానంతో మాకు అప్పుడే అంతా బాగా జరుగుతుందనే నమ్మకం కలిగింది. మళ్ళీ నిన్న ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ కోసం సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. మీరు ఇంత పెంచుకోండి, ఇంత తగ్గించండి ఇలాంటివి ఆయన చేయరు. జీవో పాస్ చేశాం, జీవో పధ్ధతిలో ఎలా జరగాలో అలా జరుగుతుందని చెప్పారు. కానీ మీరు భారీ బడ్జెట్ తో సినిమా తీశారని అర్థం చేసుకోగలను. మీకు నష్టం రాకూడదు, అదే సమయంలో ప్రేక్షకులపై అధిక భారం కూడా పడకూడదు. ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ధరలు ఉంటాయని సీఎం అన్నారు." అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.
బెనిఫిట్ షోల అంశంపై స్పందించిన రాజమౌళి.. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇచ్చిందని, దానిని బట్టి చూస్తే ఒక్కరోజు కాదు అన్ని రోజులూ బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చినట్లే కదా అని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడనని, అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నానని రాజమౌళి అన్నారు.






