![]() |
![]() |

తెలుగునాట ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అనే మాట వినగానే ఠక్కున గుర్తొచ్చే కథానాయిక.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. 80, 90ల్లో ఈ తరహా చిత్రాలతో శక్తిమంతమైన కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. అలాంటి విజయశాంతిలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించిన ఘనత మాత్రం నాటి మేటి దర్శకుల్లో ఒకరైన టి.కృష్ణదే. టి.కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి అభినయించిన చిత్రాలన్నీ కూడా విజయతీరాలకు చేరినవే. మరీముఖ్యంగా.. దిగ్గజ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన `ప్రతిఘటన` అటు విజయశాంతి, ఇటు టి. కృష్ణ కెరీర్ లో మేలిమలుపుగా నిలిచింది. అంతేకాదు.. 1985 సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాతో `ఉత్తమ నటి`గా ఇటు `నంది` పురస్కారాన్ని, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డ్ ని కూడా అందుకుని వార్తల్లో నిలిచారు విజయశాంతి.
సమాజంలోని అవినీతిపై, రాజకీయ చీడపురుగులపై కాలేజ్ లెక్చరర్ ఝాన్సీ ఎలా ప్రతిఘటించింది? అన్నదే ఈ చిత్ర కథాంశం. అలాగే ఝాన్సీ పాత్రకి జరిగిన అవమానం కూడా ఈ సినిమాలో కీలకాంశమే. విజయశాంతి నటన, చక్రవర్తి పాటలు (మరీముఖ్యంగా.. వేటూరి సాహిత్యంతో ఎస్. జానకి గానం చేసిన ``ఈ దుర్యోధన``), ఎం.వి.యస్. హరనాథ రావు సంభాషణలు, టి. కృష్ణ దర్శకత్వ ప్రతిభ, ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణ విలువలు వెరసి `ప్రతిఘటన` తెలుగునాట ఓ సంచలనంగా నిలిచింది. ఆరు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న `ప్రతిఘటన`.. మలయాళ, హిందీ భాషల్లో రీమేక్ బాట పట్టింది. 1985 అక్టోబర్ 11న విడుదలై అఖండ విజయం సాధించిన `ప్రతిఘటన`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |