![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా.. అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవన్. అలాంటి పవన్.. తెరంగేట్రం చేసి నేటికి (అక్టోబర్ 11) సరిగ్గా పాతికేళ్ళు. ప్రముఖ దర్శకులు ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన `అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి` (1996)తో కథానాయకుడిగా తొలి అడుగేశారు పవన్. ఇక ఇదే చిత్రంతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా పరిచయం కావడం విశేషం.
1988 నాటి హిందీ చిత్రం `ఖయామత్ సే ఖయామత్ తక్` (ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా) ఆధారంగా తెరకెక్కిన `అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి`లో నాజర్, చంద్రమోహన్, శరత్ బాబు, ఆహుతి ప్రసాద్, అల్లు రామలింగయ్య, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబూ మోహన్, కవిత, సుధ, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. ఊహా అతిథి పాత్రలోనూ, రంభ ప్రత్యేక గీతంలోనూ దర్శనమిచ్చారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం, ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1996 అక్టోబర్ 11న విడుదలై విజయకేతనం ఎగురవేసిన `అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి`.. నేటితో 25 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. పవన్ నట ప్రస్థానానికి పాతికేళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |