![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ముగిసింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రకాష్ రాజ్ పై గెలిచిన మంచు విష్ణు.. 'మా' అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా 'మా' హీట్ తగ్గలేదు. ముందు నుండి ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్ ఓటమితో మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాటలో ప్రకాష్ రాజ్ కూడా నడిచారు.
'మా' ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఉదయం ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ ఎన్నికల్లో గెలిపిన అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు అని చెప్పారు. అయితే ఈ ఎన్నికలలో తెలుగు వాడు కాదు, ప్రాంతీయత, జాతీయ వాదం అనే అంశాలు తెరపైకి తెచ్చారని అన్నారు. 'మా బైలాస్ మార్చాలి, తెలుగువాడు కానివాడు ఓటు వేయొచ్చు కానీ పోటీ చేయకూడదు' అనే నినాదం స్టార్ట్ చేశారు. మా బైలాస్ మార్చుతామని హామీ కూడా ఇచ్చారు. 'ఏం చేయను?.. నా తల్లిదండ్రులు తెలుగువాళ్ళు కాదు.. అది నా తప్పు కాదు.. వాళ్ళ తప్పు కూడా కాదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా అసోసియేషన్ కు నాయకులుగా తెలుగువాళ్ళు మాత్రమే ఉండాలన్నారు. దానిని మా మెంబెర్స్ ఆమోదించి, తెలుగువాడినే ఎన్నుకున్నారు. దానిని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందుకే మా సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను అని ప్రకాష్ రాజ్ తెలిపారు. నాకు సినీ పరిశ్రమకు ఉన్న బంధం, నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం ఇలాగే కొనసాగుతుంది. కానీ నేను ఒక అతిథిగానే ఉండాలంటే మాత్రం మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండలేను.. అందుకే మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకాష్ రాజ్ తేల్చి చెప్పారు.
![]() |
![]() |