![]() |
![]() |

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పలు చిత్రాలు.. నటసింహం నందమూరి బాలకృష్ణకి భలేగా కలిసొచ్చాయి. వాటిలో `ప్రెసిడెంటు గారి అబ్బాయి` ఒకటి. ఇందులో ప్రెసిడెంట్ గా జగ్గయ్య నటించగా టైటిల్ రోల్ లో బాలయ్య మెస్మరైజ్ చేశారు. బాలకృష్ణకి జంటగా సుహాసిని దర్శనమిచ్చిన ఈ సినిమాలో సత్యనారాయణ, సుధాకర్, ఈశ్వర రావు, రాజేశ్, నూతన్ ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, సాక్షి రంగారావు, పి.ఎల్. నారాయణ, వంకాయల సత్యనారాయణ, అన్నపూర్ణ, రాజ్యలక్ష్మి, వై. విజయ, వరలక్ష్మి, నిర్మలమ్మ, కుయిలి, మాస్టర్ రాజేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కథ, సంభాషణలు సమకూర్చిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ మూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు.
చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామమూర్తి సాహిత్యమందించారు. ``చెక్కం చెక్కం``, ``ముద్దు పెట్టమంటే``, ``ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా``, ``సిత్రాంగి పిలిచింది``, ``యాడ నుండి వస్తే``.. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు నిర్మించిన `ప్రెసిడెంటు గారి అబ్బాయి`.. 1987 మే 14న విడుదలై మంచి విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 35 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |