![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు భలేగా అచ్చొచ్చాయి. వాటిలో `యముడికి మొగుడు` ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యముడిగా కైకాల సత్యనారాయణ నటించగా.. టైటిల్ రోల్ లో చిరంజీవి అలరించారు. చిరుకి జంటగా విజయశాంతి, రాధ నటించిన ఈ సినిమాలో చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య దర్శనమిచ్చారు. రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రాజ్ - కోటి సంగీతమందించిన ఈ చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ``అందం హిందోళం``, ``వానజల్లు గిల్లుతుంటే``, ``బహుశా నిన్ను``, ``ఎక్కు బండెక్కు మామ``, `కన్నెపిల్ల తోటి``, ``నో నో నాట్యమిదా``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. డైనమిక్ మూవీ మేకర్స్ పతాకంపై చిరు మిత్రులు, నటులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు సంయుక్తంగా నిర్మించిన `యముడికి మొగుడు`.. రూ. 5 కోట్లకు పైగా షేర్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా అప్పట్లో రికార్డులకెక్కింది. అలాగే, తమిళంలో `అతిశయ పిరవి` (సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడు) పేరుతో రీమేక్ అయింది. కాగా, 1988 ఏప్రిల్ 29న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `యముడికి మొగుడు`.. నేటితో 34 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |