![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో శత్రువు ఒకటి. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయికగా నటించింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడిగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో విజయ్ కుమార్, సంగీత, ఆనంద్ రాజ్, మహర్షి రాఘవ, బ్రహ్మానందం, బాబూ మోహన్, జయప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. రాజ్ - కోటి స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. అమ్మ సంపంగి రేకు, పొద్దునే పుట్టింది చందమామ గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. 1991 జనవరి 2న విడుదలైన శత్రువు నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
శత్రువు - కొన్ని విశేషాలు
* వెంకటేష్, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రమిది. ఆపై ఈ ఇద్దరూ సూర్య ఐపీఎస్, చినరాయుడు సినిమాల్లో జంటగా కనువిందు చేశారు.
* నిర్మాత ఎమ్మెస్ రాజుకి ఇదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే మరపురాని విజయాన్ని అందుకున్నారాయన. ఆపై సంక్రాంతి సీజన్ లో పలు ఘనవిజయాలతో సందడి చేశారు.
* శత్రువు తరువాత వెంకీ, కోడి రామకృష్ణ, ఎమ్మెస్ రాజు కాంబోలో వచ్చిన దేవీపుత్రుడు (2001) కూడా జనవరి నెలలోనే విడుదలైంది.
* శత్రువు చిత్రం హిందీలో విజేత (1996) పేరుతో రీమేక్ అయింది. సంజయ్ దత్, రవీనా టాండన్ జంటగా నటించిన ఈ సినిమాకి కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.
![]() |
![]() |