![]() |
![]() |

మిడిల్ క్లాస్ కుటుంబాలకు సినిమానే పెద్ద వినోదం. కుటుంబమంతా కలిసి నెలకి కనీసం రెండు సినిమాలైనా చూస్తుంటారు. సినిమాలకు వచ్చే కలెక్షన్స్ లో మెజారిటీ కలెక్షన్స్ వాళ్ళు చూడటం వల్ల వచ్చేవే. అయితే టికెట్ ధరల పెంపుతో మిడిల్ క్లాస్ వారు సినిమాలకు దూరమవుతున్నారు. దాంతో సినిమాలకు భారీ నష్టాలు వస్తున్నాయి.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సినిమాకి వచ్చిన టాక్ సంగతి పక్కన పెడితే.. ఇద్దరు బడా స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమాకి ఫస్ట్ డే చాలాచోట్ల షోలు కూడా ఫుల్ కాలేదు. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరల పెంపు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే తెలంగాణలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.. దానికి తోడు కొద్దిరోజుల పాటు హైక్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సినిమాకి హైక్ లభించింది. అదే ఇప్పుడు ఆచార్య కొంపముంచింది అంటున్నారు.
భారీ బడ్జెట్ సినిమా పేరుతో 'ఆర్ఆర్ఆర్' కి తెలుగు రాష్ట్రాల్లో హైక్ ఇచ్చారు. ఆ సినిమా ప్రత్యేకమైన సినిమా కావడంతో ప్రేక్షకులు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయకుండా థియేటర్స్ కి పోటెత్తారు. ఆ తర్వాత కన్నడ డబ్బింగ్ మూవీ 'కేజీఎఫ్-2'కి కూడా తెలంగాణలో హైక్ ఇచ్చారు. పాన్ ఇండియా క్రేజ్ తో ఆ మూవీని కూడా ప్రేక్షకులు ఆదరించారు. అదే బాటలో 'ఆచార్య'కి కూడా ఏపీ, తెలంగాణలో హైక్ ఇచ్చారు. కానీ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టట్లేదు.
తెలుగు సినిమా స్థాయిని పెంచే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి ప్రత్యేక సినిమాలకు హైక్ ఇవ్వడం వరకు ఓకే గానీ.. స్టార్ హీరోలు నటించిన ప్రతి సినిమాకీ హైక్ ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు అంటున్నారు. పెంచిన టికెట్ ధరల కారణంగా నలుగురు ఉన్న కుటుంబం సినిమాకి వెళ్తే రెండు వేలు ఖర్చవుతుంది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2' సినిమాలకు నాలుగు వేలు ఖర్చు పెట్టిన కుటుంబాలు.. 'ఆచార్య' కోసం మరో రెండు వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేవు. అందుకే ఆచార్యకు మొదటి మూడు రోజులు కూడా టికెట్స్ పెద్దగా బుక్ కాలేదు. సినిమా బాగుందని టాక్ వస్తే వెళ్దాం లేదా టికెట్ ధరలు తగ్గాక వెళదామని ఆగిపోయారంతా. ఇప్పుడు నెగటివ్ టాక్ రావడంతో ఇక ఈ సినిమాని చూడాలన్న ఆలోచననే విరమించుకుంటున్నారు. ఒకవేళ ఆచార్యను సాధారణ టికెట్ ధరలతో రిలీజ్ చేసినట్లయితే.. చిరు, చరణ్ నటించిన సినిమా కాబట్టి కనీసం మొదటి నాలుగైదు రోజులకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగుండేవి. అప్పుడు టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి.
'ఆచార్య' దెబ్బతో ఇప్పుడు అందరి దృష్టి 'సర్కారు వారి పాట'పై పడింది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైక్ పేరుతో మిడిల్ క్లాస్ కుటుంబాలను సినిమాకి దూరం చేయకుండా.. సాధారణ టికెట్ ధరలతో అందరికీ సినిమా అందుబాటులో ఉండేలా రిలీజ్ చేస్తే మంచిదని ఫ్యాన్స్, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి 'సర్కారు వారి పాట' మూవీ హైక్ కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తలుపు తడుతుందో లేక సాధారణ టికెట్ ధరలతో అందరికీ అందుబాటులో ఉంటుందో చూడాలి.
కేవలం 'సర్కారు వారి పాట' టీమ్ మాత్రమే కాకుండా మిగతా స్టార్ హీరోల సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా టికెట్ ధరల హైక్ పై పునరాలోచిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టిన డబ్బంతా మొదటి వారంలోనే రాబట్టాలన్న అత్యాశకు పోతే.. ఆచార్యకు తగిలిన దెబ్బే ముందు ముందు మిగతా సినిమాలకు కూడా తగిలే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |