![]() |
![]() |

``నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది``, ``నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా``, ``నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ`` .. వంటి డైలాగ్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన చిత్రం `గబ్బర్ సింగ్`. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `దబాంగ్` (సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా)ని ఆధారంగా చేసుకుని తెలుగు నేటివిటికి తగ్గట్టు చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన మార్పులు, చేర్పులు `గబ్బర్ సింగ్` ఘనవిజయంలో ముఖ్య పాత్ర పోషించాయి. మరీముఖ్యంగా.. అంత్యాక్షరి ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాతోనే చెన్నైపొన్ను శ్రుతి హాసన్ తన కెరీర్ లో తొలి విజయం అందుకుంది. సుహాసిని, అభిమన్యు సింగ్, అజయ్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి, జయప్రకాశ్ రెడ్డి, హరితేజ, సత్యం రాజేశ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మలైకా అరోరా ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. టైటిల్ సాంగ్ తో పాటు ``ఆకాశం అమ్మాయైతే``, ``పిల్లా నువ్వు లేని జీవితం``, ``గుండె జారి గల్లంతయ్యిందే``, ``కెవ్వు కేక``, ``మందు బాబులం``.. ఇలా అన్నీ పాటలు రంజింపజేశాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మించిన `గబ్బర్ సింగ్`.. `ఉత్తమ నటుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు`, `ఉత్తమ గాయకుడు` (వడ్డేపల్లి శ్రీనివాస్ - పిల్లా నువ్వు లేని జీవితం) విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుంది. 2012 మే 11న విడుదలై ఆ యేటి మేటి గ్రాసర్ గా నిలిచిన `గబ్బర్ సింగ్`.. నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |