English | Telugu
జడ్జిలు బాడీ షేమింగ్.. ఎక్స్ పోజింగ్ చేయాలని ఒత్తిడి.. వివాదంలో 'పాడుతా తీయగా' షో!
Updated : Apr 21, 2025
ఈటీవీలో ప్రసారమయ్యే 'పాడుతా తీయగా' షోకి ఎంతటి పేరుందో తెలిసిందే. లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నడిచిన ఈ పాటల ప్రోగ్రామ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఎందరో సింగర్స్ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఈ షోహోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ జరుగుతుండగా.. ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్, సునీత జడ్జిపైగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ జడ్జిలపై తాజాగా సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. (Padutha Theeyaga)
సూపర్ సింగర్ సహా పలు షోలలో విజేతగా నిలిచిన ప్రవస్తి.. 'పాడుతా తీయగా' సిల్వర్ జూబ్లీ సిరీస్ లో పార్టిసిపేట్ చేసింది. అయితే ఆమె అనూహ్యంగా చాలా త్వరగానే ఈ షో నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రవస్తి.. షోపైనా, జడ్జిలపైనా సంచలన ఆరోపణలు చేసింది.
"పాడుతా తీయగా కి వెళ్లాలనుకునే సింగర్స్‌కి నా సలహా ఒక్కటే. ఏమైనా రికమండేషన్స్ లేదా జడ్జిల నుంచి రిఫరెన్స్‌లు ఉంటే మాత్రమే వెళ్ళండి. అవి లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేధింపులు మాత్రమే ఎదురవుతాయి." అని ప్రవస్తి ఆరోపించింది. "జడ్జిలు నన్ను చీడపురుగుల్లాగా చూసేవారు. నా బాడీ మీద జోకులు వేసేవారు. ఇవన్నీ నాకు వారి దగ్గర్లో కూర్చున్న ఆడియన్స్ ద్వారా తెలిశాయి. ఇంత పేరున్న జడ్జెస్ నుంచి నేను ఇలాంటివి అసలు ఊహించలేదు. షో మేనేజ్మెంట్ కూడా కంటెస్టెంట్స్ డ్రెస్సింగ్ ఎక్స్ పోజింగ్ చేసేలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడేవారు. నాభి కనిపించేలా చీర కట్టాలి అనేలా వారి మాటలు అనేది. ఒక షోలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి" అని ప్రవస్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
