English | Telugu

హైలైట్ గా నిలిచిన గౌతమ్ జర్నీ వీడియో.. ఆ మాట చెప్పి కాలర్ ఎగరేశాడు!

హైలైట్ గా నిలిచిన గౌతమ్ జర్నీ వీడియో.. ఆ మాట చెప్పి కాలర్ ఎగరేశాడు!

 

బిగ్ బాస్ ఆట మరో కీలకమైన దశకు చేరుకుంది. ఫినాలే వీక్‌లో ఫైనలిస్ట్‌ల జర్నీ వీడియోలు వాళ్ల ఓటింగ్‌పై చాలా ప్రభావితం చూపిస్తాయి. వాళ్ల జర్నీని ఎంత బాగా చూపిస్తే అన్ని ఓట్లు. ఎవరి జర్నీని ఎలా చూపించారు? ఎంతసేపు చూపించారు? ఎప్పుడు చూపించారు? ఇవన్నీ కూడా చాలా కీలకమే. అయితే ఇక విజేతను తేల్చేందుకు మూడు రోజుల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ జర్నీ వీడియోల టైమింగ్ కూడా చాలా కీలకం. అయితే ఫైనలిస్ట్‌లలో తొలి జర్నీ వీడియో గౌతమ్‌ దే అయ్యింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ రేస్‌లోకి దూసుకుని వచ్చాడు గౌతమ్. అశ్వర్థామ ఈజ్ బ్యాక్ అంటూ టైటిల్‌కి మరో అడుగుదూరంలో ఉన్నాడు గౌతమ్.

గార్డెన్ ఏరియాలో ఈ జర్నీ వీడియోలకు సంబంధించిన డెకరేషన్ చేశారు. ఎప్పటిలాగే ఫొటోలు, క్రాకర్స్‌తో స్వాగతం పలికారు. అనంతరం గౌతమ్ జర్నీ గురించి బిగ్ బాస్ పొగడ్తల వర్షం‌తో పాటు కీలకమైన విషయాలను తెలియజేశారు. ‘‘బుద్ది బలం, భజ బలం కలయికతో ఒక యోధుడిలా కదులుతూ మీ ఆట ఏ ఆటకం లేకుండా ముందుకు సాగింది. మీరు కోరుకున్న ప్రేమ హౌస్‌లో దొరక్కపోయినా.. అది మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లో మీకు మానవ సంబంధాలు లేవని.. అన్నీ ప్రేక్షకుల కోసమే చేస్తారని.. తోటి సభ్యులు మీపై ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ.. వారి ఆటలో భాగం అని మీకు తెలుసు. అందుకే.. మీ పంథా మార్చకుండా.. మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్‌గా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అవి నెరవేర్చుకోవడానికి కార్యదీక్ష అవసరం. ఈ రెండూ కనబరిచిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం’ అంటూ బిగ్ బాస్ తన మాటలతో గౌతమ్‌కి ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారు. గౌతమ్ జర్నీలో ఆనందం, బాధ, దుఖం ఇలా చాలా వేరియేషన్స్ చూపించారు. మొదటిగా గౌతమ్ జర్నీతో ఫన్‌తో మొదలైంది. అతని ఎంట్రీ నుంచి ఫన్ వేలో తీసుకుని వెళ్లారు. ఆ తరువాత యష్మీని ఫ్లర్ట్ చేసింది చూపించారు. ఆమె ఏవిధంగా ప్రేమించినట్టే ప్రేమించి.. వెనుక ఏవిధంగా గోతులు తవ్విందో చూపించారు లైవ్‌లో. ఆ తరువాత అశ్వర్థామ పేరు గురించి జరిగిన గొడవను చూపించారు. ఎలిమినేట్ అయిన ఎలా పుంజుకుని వచ్చాడో ఓ రేంజ్‌లో ఎలిమినేషన్స్‌తో చూపించారు.

మహర్షి చిత్రంలో ‘ఇదే కదా.. ఇదే కదా’ సాంగ్‌తో గౌతమ్‌లోని అసలు కోణాన్ని ఆవిష్కరించారు. ‘అశ్వర్థామకి చావేలేదు’ అంటూ నాగార్జున చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ.. గౌతమ్ కన్నడ బ్యాచ్‌తో వీరోచితంగా పోరాడిన వాటిని చూపించారు. పృథ్వీతో గొడవ, నిఖిల్‌తో గొడవ, యష్మీతో గొడవ, నబీల్‌తో గొడవ, ప్రేరణతో గొడవ.. ఇవన్నీ హైలైట్ అయ్యాయి. యష్మీతో అక్క మ్యాటర్ కూడా హైలైట్ అయ్యింది. నిఖిల్ ఉద్దేశించి.. ‘నేను ఆ పదం మాట్లాడి ఉంటే.. కంఠం కోసుకుని చచ్చిపోతా’ అన్న డైలాగ్‌ని కూడా వినిపించారు ఏవీలో. తన గురించి కన్నడ బ్యాచ్ అంతా.. బ్యాక్ బిచ్చింగ్ ఎలా చేశారో చూపించారు. అయితే చాలా వరకూ ఏవీని చూపించకుండా.. కేవలం గౌతమ్‌ని మాత్రమే చూపించారు. హౌస్‌లోకి వచ్చినప్పుడు గౌతమ్ తల్లి చెప్పిన మాటలతో గౌతమ్ జర్నీ వీడియోను ముగించారు. అయితే ఈ వీడియో చూసి గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. సీజన్ 7 నా లైఫ్‌లో గుర్తుండిపోయే మెమొరీ అనుకున్నా. కానీ సీజన్ 8 నా లైఫ్ మైల్డ్ స్టోన్. నాకు బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ విజువల్స్ చూస్తుంటే.. నా జర్నీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో నాకు అర్థం అయ్యింది బిగ్ బాస్. 

నాకు మా అమ్మ ఒక్కమాట చెప్పి పంపించింది. నువ్వు ఒక్కడివే ఆడు.. ఒక్కడివే చివరి వరకూ పోరాడు. నీ లైఫ్‌లో ఎవరూ ఏమీ చేయరు. నీ కోసం నువ్వే నిలబడు అని అన్నారు మా అమ్మ. అందుకే ఆడితే ఒక్కడ్నే ఆడాలని అనుకున్నా. ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు అని అనుకున్నాను అలాగే ఆడా. ఆ జర్నీ చూస్తే మా అమ్మ చెప్పిన మాట రైట్. నా ఆలోచన రైట్ అనిపించింది. నా జీవితంలో సీజన్ 8ని ఎప్పుడూ మర్చిపోలేను. ఈ వీడియో చూస్తుంటే ఒంట్లో కరెంట్ పాస్ అయ్యింది. నేను సోలో అని గొప్పగా చెప్పుకోవడం లేదు. ఒక్కడే నిలబడి పోరాడితే సక్సెస్ అవుతాం అని నమ్మినా.. కోట్లమందికి అది ప్రూవ్ చేయాలని అనుకున్నా. కాలర్ ఎగరేసి చెప్తున్నా.. నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్. మా అమ్మ నన్ను నడిపించిన మార్గం కరెక్ట్. మా అమ్మ నన్ను చూసి గర్వపడేట్టు చేశా.

నేను సీజన్ 8కి రెస్పెక్ట్ కోసం వచ్చా.. నాకు లైఫ్‌లో ఎప్పుడూ రెస్పెక్ట్ దొరకలేదు. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది దొరికింది. ఇదీ గెలుపు అంటే. ఆడియన్స్ హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నా.. గెలుచుకున్నా. ఆదర్శంగా నిలవాలి అనుకున్నా.. నేను కామన్ పర్సన్‌నే. నేను పర్ఫెక్ట్ కాదు. నేను ఎవర్ని నొప్పించినా క్షమాపణ చెప్పా. ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన తరువాత కూడా.. ఈ పాఠాలను గుర్తించుకుంటా. ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించను.. నాకోసం నేను నిలబడతా. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తా బిగ్ బాస్. నాకు మీరు గురువు బిగ్ బాస్. నా జీవితాన్ని తీర్చిదిద్దారు. మీకు శతకోటి పాదాభివందనాలు బిగ్ బాస్ అంటూ శ్రాష్టాంగ నమస్కారం చేసి ఎమోషనల్ అయ్యాడు గౌతమ్.