Read more!

English | Telugu

100 కోట్ల క్లబ్ లో 'విరూపాక్ష'

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ వసూళ్లతో సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'విరూపాక్ష' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిందని తెలుపుతూ మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో వంద కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. పైగా నాలుగు వారాల్లోనే ఈ ఫీట్ సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా చాలా చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 'విరూపాక్ష'కి అదిరిపోయే పాజిటివ్ టాక్ రావడం, ఈ నెల రోజులుగా ఇతర సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ప్రేక్షకులంతా 'విరూపాక్ష'కే ఓటేశారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది.

మరోవైపు 'విరూపాక్ష' అప్పుడే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమాకి ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.