Read more!

English | Telugu

సావిత్రిలాగే శ్రీదేవి కూడా మద్యం వల్లే ప్రాణాలు కోల్పోయింది.. తోటపల్లి మధు సంచలన వ్యాఖ్యలు! 

అందం, అభినయం, చలాకీతనం, సినిమా అంటే ప్యాషన్‌, డెడికేషన్‌, కష్టపడే మనస్తత్వం, వీటన్నింటికీ అదృష్టం తోడైతే ఇక ఆ హీరోయిన్‌ తారాపథానికి చేరుకోవడం కష్టమైన పని కాదు. 
అందం అంటే శ్రీదేవి
అభినయం అంటే శ్రీదేవి
చలాకీతనం అంటే శ్రీదేవి.. ఇలా ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న శ్రీదేవి తారాపథంలోకి దూసుకెళ్ళింది. తారలెన్ని ఉన్నా ధృవతార ఒక్కటే అన్నట్టుగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందింది. 50 సంవత్సరాల ఆమె సినీ కెరీర్‌లో ఎవరితోనూ వివాదాలు లేవు, తన ప్రవర్తనతో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే తన బాధ్యతగా భావించిన శ్రీదేవికి పని తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేశవ్యాప్తంగా పలు భాషల్లో వందలాది సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఆలిండియా స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి శ్రీదేవి గురించి ఒక సినీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమె వ్యక్తిగత విషయాలతోపాటు ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, ఆమెకు వున్న వ్యసనాల గురించి ప్రస్తావించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీదేవి గురించి సర్వస్వం తనకు తెలుసును అన్నట్టు ఆమె కుటుంబ సభ్యుడిలా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అతనెవరో కాదు, ప్రముఖ రచయిత తోటపల్లి మధు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

‘సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఒకసారి మేకప్‌ వేసుకున్న తర్వాత ఆ ప్రపంచం నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం.  ఎన్ని సినిమాల్లో నటించినా, ఎన్ని క్యారెక్టర్లు చేసినా వారికి తృప్తి ఉండదు. ఇంకా ఇంకా చెయ్యాలి అనిపిస్తుంటుంది. శ్రీదేవిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచి ఆమె సినిమా ఫీల్డులోనే ఉంది. కొన్ని వందల సినిమాల్లో నటించింది. కానీ, ఆమెకు 55 సంవత్సరాలు వచ్చేసరికి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వచ్చాయి. డయాబెటీస్‌, హై బి.పి., హైపర్‌ టెన్షన్‌ ఆమెకు ఉన్నాయి. వీటికి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ తోడైంది. ఐశ్వర్యారాయ్‌, కత్రినా కైఫ్‌ వంటి యంగ్‌ హీరోయిన్లకు స్టార్‌డమ్‌ వచ్చేసింది. తనను దాటి వాళ్ళు ముందుకు వెళ్లిపోతున్నారు. తను ఇంకా యంగ్‌గా ఎలా ఉండాలి అనే దానిమీదే ఆమె కాన్‌సన్‌ట్రేషన్‌ ఉండేది. అందుకే చీటికి మాటికీ ప్లాస్టిక్‌ సర్జరీ పేరుతో లండన్‌ వెళ్లిపోయేది. దీనికితోడు డైటింగ్‌. ఎక్కువగా తినేది కాదు. కానీ, ఆమె మంచి డ్రింకర్ కూడా. డ్రింక్ అనేది ఇప్పుడు సినిమా వాళ్ళకు ఒక పార్ట్‌ ఆఫ్‌ లైఫ్‌ అయిపోయింది. రిలాక్సేషన్‌ కోసమే మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. 

శ్రీదేవి విషయంలో ఏం జరిగిందంటే.. ఆమెకు డయాబెటీస్‌ చాలా ఎక్కువగా ఉండేది. తిండి తినాలంటే ఆమెకు చాలా భయం. మరోపక్క పిల్లల గురించి టెన్షన్‌. తనలాగే పిల్లలు కూడా మంచి స్థాయికి వస్తారనుకుంది. ఇక శ్రీదేవికి, ఇద్దరు ఆడపిల్లలకు విపరీతమైన ఖర్చు ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురికీ బోనీకపూర్‌ రోజుకి లక్ష రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో విపరీతంగా సినిమాలు చేస్తూ రోజుకి మూడు షిఫ్టులు కష్టపడేది శ్రీదేవి. అలాంటిది పనిలేకుండా అయిపోయింది. తను ఇరవై ఏళ్ళ వయసులో ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా ఉండాలనుకునేది. ఆరోగ్య సమస్యల వల్ల అది సాధ్యమయ్యేది కాదు. దాంతో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోయి బాగా తాగేది. ఉదయం డ్రింక్ చేస్తుంది, రాత్రి డ్రింక్ చేస్తుంది. ఆమె చనిపోయిన రోజు కూడా రాత్రి 11 గంటలకు డ్రింక్ స్టార్ట్‌ చేసింది. ఆ సమయంలో పిల్లలుగానీ, బోనీ కపూర్‌గానీ దగ్గర లేరు. ఆమె ఏ మందులు వేసుకోవాలి, ఎప్పుడు ఇంజెక్షన్‌ చేసుకోవాలి వంటి విషయాలన్నీ బోనీ కపూరే ఫోన్‌ చేసి గుర్తు చేస్తారు. ఆ టైమ్‌లో ఆమె ఫోన్‌ చార్జింగ్‌ లేక స్విచ్‌ఆఫ్‌ అయిపోవడంతో అలా ఆలోచిస్తూ డ్రింక్ చేస్తూనే ఉంది. ఒక్కసారిగా షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి. అయినా తాగుతూనే ఉంది. ఆ టైమ్‌లో బోనీ కపూర్‌ వచ్చాడు. ఆ ఆనందంలో ఇంకా తాగింది. ఆ తర్వాత బాత్‌రూమ్‌కి వెళ్ళగానే కోమాలోకి వెళ్లిపోయింది. గతంలో సావిత్రి అలా తాగడం వల్లే కోమాలోకి వెళ్ళిన 14 నెలల తర్వాత చనిపోయారు. శ్రీదేవికి మాత్రం 14 నిమిషాలే పట్టింది. రిచ్‌ శ్రీదేవి, పూర్‌ సావిత్రి డ్రింక్ వల్లే ప్రాణాలు కోల్పోయారు’ అంటూ ఇప్పటివరకు ఎవరూ ప్రస్తావించని అంశాల గురించి తోటపల్లి మధు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

తోటపల్లి మధు అసందర్భంగా శ్రీదేవి వ్యవహారాన్ని మధ్యలోకి తీసుకురావడం, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పడం, మద్యానికి బానిస అయిందంటూ వ్యాఖ్యానించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. పైగా మద్యానికి బానిస అవ్వడం వల్లే  శ్రీదేవి కూడా చనిపోయిందని సావిత్రితో కంపేర్‌ చేస్తూ చెప్పడం ఆందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ విషయాలన్నీ సోషల్‌ మీడియాలోకి వెళ్ళిపోవడంతో తోటపల్లి మధును ట్రోల్‌ చెయ్యడం మొదలుపెట్టారు. శ్రీదేవి గురించి సొల్లు మాట్లాడుతున్నాడని, ఆ టైమ్‌లో నువ్వు శ్రీదేవి పక్కనే వున్నావా అని కొందరు కామెంట్‌ చేస్తుంటే, మరికొందరు శ్రీదేవి చాలా డిసిప్లిన్డ్‌ హీరోయిన్‌ అని, డ్రింక్ చేస్తే ఫిజిక్‌ అలా ఉండదని, తోటపల్లి మధు నాన్‌సెన్స్‌ మాట్లాడుతున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. కావాలనే ఇలాంటి కాంట్రవర్సీలు సృష్తిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.