English | Telugu
సూర్య దిమ్మతిరిగే రెమ్యూనరేషన్.. ఫ్లాప్స్ లోనూ తగ్గేదేలే!
Updated : May 4, 2025
హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా.. స్టార్స్ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతారని అంటుంటారు. కోలీవుడ్ స్టార్ సూర్య కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
విభిన్న చిత్రాలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. ఆయన కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అలాంటి సూర్య.. థియేటర్లలో సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి మంచి సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా ఫిల్మ్ కంగువా దారుణంగా నిరాశ పరిచింది. రీసెంట్ గా రెట్రోతో పలకరించగా అదీ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో సూర్య కమ్ బ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సూర్య తన 45వ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ ఫిల్మ్ చేయనున్నాడు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం కోసం సూర్య ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు వినికిడి. ఇది సూర్య కెరీర్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అంటున్నారు.
ప్రస్తుత సూర్య ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే ఈ పారితోషికం ఎక్కువనే చెప్పాలి. అయితే కంటెంట్ మీద నమ్మకం, అలాగే తెలుగు-తమిళ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సితార సంస్థ ఇంత మొత్తం ఇవ్వడానికి సిద్ధపడినట్లు టాక్.
