Read more!

English | Telugu

'సత్య' మూవీ రివ్యూ

సినిమా పేరు: సత్య
తారాగణం: హమరేష్‌, ప్రార్థన, ఆడుకాలం మురుగదాస్‌, సాయి శ్రీ ప్రభాకరణ్‌, అక్షయ హరిహరణ్ తదితరులు
సంగీతం: సుందరమూర్తి కె.యస్
డీఓపీ: ఐ. మరుదనాయగం
ఎడిటింగ్: ఆర్‌.సత్యనారాయణ 
రచన, దర్శకత్వం: వాలీ మోహన్‌దాస్
నిర్మాత: శివ మల్లాల
బ్యానర్: శివమ్‌ మీడియా
విడుదల తేదీ: మే 10, 2023

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే, ఇతర భాషలకు చెందిన సినిమాలను కూడా ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల పలు మలయాళ సినిమాలు తెలుగునాట ఆదరణ పొందాయి. ఇప్పుడు తమిళ సినిమా వంతు వచ్చింది. తమిళంలో విజయం సాధించిన 'రంగోలి' అనే సినిమా.. 'సత్య' పేరుతో తాజాగా తెలుగులో విడుదలైంది. సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా మారి, ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
గాంధీ(ఆడుకాలం మురుగదాస్‌) తన భార్య కళ(సాయి శ్రీ ప్రభాకరణ్‌), పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. లాండ్రీ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కుమార్తె లక్ష్మి(అక్షయ హరిహరణ్) లాండ్రీ వర్క్ లో సపోర్ట్ గా ఉంటుంది. కుమారుడు సత్య(హమరేష్‌) గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్ చదువుతుంటాడు. అయితే అక్కడ తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల కారణంగా సత్య ఒకసారి జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇలాగే ఉంటే సత్య చదువు అటకెక్కుతుందని, తన కొడుకు కూడా జీవితాంతం తనలాగే కష్టపడాల్సి వస్తుందని భావించిన గాంధీ.. స్థోమత లేకపోయినా అప్పుచేసి మరీ సత్యని మంచి ప్రైవేట్ కాలేజ్ లో చేర్పిస్తాడు. అయితే ఆ కాలేజ్ లో సత్య ఇమడలేకపోతాడు. పైగా అక్కడ కూడా గొడవలు ఎదురవుతూనే ఉంటాయి. దీనికితోడు పార్వతి(ప్రార్థన) అనే అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు సత్య. అయితే ఒక ఘటన కారణంగా మనసు పడిన అమ్మాయి చేతిలోనే చెంపదెబ్బ తింటాడు. ఓ వైపు తండ్రి అప్పులపాలు కావడం, మరోవైపు ప్రైవేట్ కాలేజ్ లో ఇమడలేకపోవడంతో.. సత్య ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. సత్య తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు పార్వతి సత్యని ఎందుకు కొట్టింది? పార్వతి ప్రేమను సత్య పొందగలిగాడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో టీనేజ్ లవ్ స్టోరీలు ఎన్నో వచ్చాయి. 'సత్య' కూడా ఆ కోవకి చెందినదే. అయితే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట వేశారు. కథగా చూసుకుంటే 'సత్య' చిన్న కథే అయినప్పటికీ.. ఆకట్టుకునే కథనం, చక్కటి సన్నివేశాలతో దర్శకుడు మ్యాజిక్ చేశాడు. కాలేజ్ రోజులను గుర్తుచేసేలా సాగిన ఈ చిత్రం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్ లలో చదువు బాగా రాదని.. స్థోమత లేకపోయినా ప్రైవేట్ సంస్థల్లో చేర్పించడం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారినప్పుడు స్టూడెంట్స్ ఇబ్బందిపడటం. డబ్బునోళ్లు ఎక్కువగా చదివే ప్రైవేట్ కాలేజ్ లలో.. పేద విద్యార్థులు ఇమడలేకపోవడం వంటి సన్నివేశాలు.. నిజ జీవితంలో మనం చూసిన లేదా ఎదుర్కొన్న సంఘటనలను గుర్తు చేసేలా ఉన్నాయి. అలాగే టీనేజ్ లో ప్రేమ కథలు ఎలా ఉంటాయో చూపించిన తీరు ఆకట్టుకుంది. అయితే దర్శకుడు సినిమా అంత సహజంగా చూపించే ప్రయత్నం చేయడంతో.. అక్కడక్కడా ల్యాగ్ అనిపించడంతో పాటు, కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపించాయి. మొత్తానికి టీనేజ్ గొడవలు, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందిన ఈ మూవీ మెప్పించింది. 

మొదటి సినిమానే అయినప్పటికీ 'సత్య' చిత్రాన్ని దర్శకుడు వాలీ మోహన్‌దాస్ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో విజువల్ స్టోరీ టెల్లింగ్ కట్టిపడేసింది. ఐ. మరుదనాయగం కెమెరా పనితనం, సుందరమూర్తి కె.యస్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్‌.సత్యనారాయణ ఎడిటింగ్ నీట్ గా ఉంది. విజయ్‌ కుమార్‌ సంభాషణలు మెప్పించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
సత్య పాత్రలో హమరేష్‌ తన సహజ నటనతో మెప్పించారు. ఆ పాత్రలోని భావోద్వేగాలను సందర్భానికి తగ్గట్టుగా చక్కగా ప్రదర్శించాడు. ఇక పార్వతి పాత్రకి ప్రార్థన పూర్తి న్యాయం చేసింది. ఆడుకాలం మురుగదాస్‌, సాయి శ్రీ ప్రభాకరణ్‌, అక్షయ హరిహరణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా..
టీనేజ్ లవ్ స్టోరీని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని తెరమీద ఆవిష్కరించిన ఈ చిత్రం మెప్పించింది.

రేటింగ్: 2.75/5