English | Telugu

సారంగపాణి జాతకం మూవీ రివ్యూ 

సారంగపాణి జాతకం మూవీ రివ్యూ 

తారాగణం: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి, నరేష్, అవసరాల శ్రీనివాస్, వైవాహర్ష, వడ్లమాని శ్రీనివాస్, కల్పలత, శివన్నారాయణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
డీఓపీ: పి.జి విందా
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
బ్యానర్: శ్రీదేవీ మూవీస్‌
విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025 

అష్టాచమ్మా, జెంటిల్ మేన్, సమ్మోహనం, వి, వంటి పలు విభిన్న చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. రీసెంట్ గా 'కోర్ట్' తో హిట్ ని అందుకున్న హీరో ప్రియదర్శి. ఆదిత్య 369 ,వంశానికొక్కడు, ఊయల, భలేవాడివి బాసు, మిత్రుడు వంటి చిత్రాలని నిర్మించిన ప్రతిష్టాత్మక సంస్థ శ్రీదేవి మూవీస్. ఈ ముగ్గురి కలయికలో తెరకెక్కిన 'సారంగపాణి జాతకం' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ
సారంగపాణి (ప్రియదర్శి) పేరున్న ఒక కార్ల కంపెనీ లో సేల్స్ మాన్ గా వర్క్ చేస్తుంటాడు. చిన్నప్పట్నుంచి జాతకాల్ని విపరీతంగా నమ్ముతు వాటి వల్లే తన లైఫ్ జర్నీ కొనసాగుతుందనేది సారంగపాణి నమ్మకం. అదే కంపెనీ లో డిపార్ట్మెంట్ హెడ్ మైథిలి (రూప కొడువాయుర్ ) ని సారంగపాణి ప్రేమిస్తాడు. తన ప్రేమని మైథిలితో ఎలా చెప్పాలనుకునే లోపే మైథిలి నే సారంగపాణికి ఐలవ్ యు చెప్తుంది. ఇద్దరి తల్లితండ్రుల ఇష్టంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. చేయి చూసి జాతకం చెప్పడంలో నెంబర్ వన్ పామిస్ట్రీ జిగ్నేశ్వర్ నంద  (అవసరాల శ్రీనివాస్) సారంగపాణితో నువ్వు ఒక మనిషివి మర్డర్ చేస్తావని చెప్తాడు. దీంతో సారంగపాణి తన పెళ్ళి వాయిదాలు వేస్తు తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిషోర్) తో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. సారంగపాణి తీసుకున్న నిర్ణయం ఏంటి? జిగ్నేశ్వర్ నంద  చెప్పినట్టుగా సారంగపాణి మర్డర్ చేశాడా? మర్డర్ చెయ్యడానికి ఎవర్ని ఎన్నుకున్నాడు? సారంగపాణి విషయం మైథిలికి తెలిసిందా? వాళ్లిద్దరి ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందా? అసలు సారంగపాణి జాతకంలో ఉన్నది నిజమేనా? అనేదే  ఈ కథ

ఎనాలసిస్ 

ముందుగా ఇలాంటి సినిమాని ప్రేక్షకులకి అందించిన ఇంద్రగంటి మోహన కృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్, ప్రియదర్శి కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఏళ్ళ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కడుపుబ్బా నవ్వుకునే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని అందించారు. సినిమా చూస్తున్నంత సేపు ఇలాంటి తెలుగు సినిమా చూసి ఎన్నాళ్లయ్యిందని అనిపిస్తుంది. పెద్ద హీరోలు భారీతనానికి పోయి సంవత్సరాలు, సంవత్సరాలు స్క్రీన్ మీద కనపడకుండా ఉండే బదులు ఇలాంటి సినిమా చేస్తే  బాగుండనే ఆలోచన కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సారంగపాణి పరిచయం దగ్గర్నుంచే  కంప్లీట్ గా మూవీలో లీనమవుతాం. మైథిలి, సారంగపాణి మధ్య వచ్చే లవ్ ప్రపోజ్ సీన్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఆ తర్వాత వెంటనే జిగ్నేశ్వర్ నంద ఎంటరవుతాడు. సారంగపాణితో మర్డర్ చేస్తావని చెప్పగానే  దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. జనరల్ గా ఇంటర్వెల్ కి ఇలాంటి సస్పెన్సు ఇస్తారు. కానీ మూవీ స్టార్ట్ అయిన పదిహేను నిమిషాలకే చెప్పే సరికి ప్రేక్షకుడు కథలోకి లీనమవుతాడు. ఇక్కడే ఇంద్రగంటి తన కామెడీ మాయాజాలాన్ని ఉపయోగించి చందు, సారంగపాణి తో కలిసి సరికొత్త కామెడీ ప్రపంచాన్ని సృషించాడు. ఈ కామెడీ జర్నీ లో వచ్చే సన్నివేశాలన్నీ నవ్వుల్లో ముంచెత్తుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో సారంగపాణి లక్ష్యానికి వైజాగ్ కి చెందిన మిలినియర్ అహోబిలం టార్గెట్ అవ్వడం, ఈ ప్రాసెస్ లో కథకి సంబంధించిన ముఖ్య పాత్రలన్నీ  ఒకే చోటుకి చేరడం, ఈ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. 

నటినటులు సాంకేతిక నిపుణుల పని తీరు

సారంగపాణి గా ప్రియదర్శి తన నటనతో ప్రేక్షకులని  మెస్మరైజ్ చేసాడు. ఇంతవరకు ప్రియదర్శి చేసిన సినిమాలు ఒక లెక్క, సారంగపాణి మరో లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ప్రియదర్శి కోసమే ఈ క్యారక్టర్ పుట్టిందా అని కూడా అనుకోవచ్చు. ఇక దర్శకుడిగా ఇంద్రగంటి మోహన కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనపడుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ అయితే నాన్ స్టాప్ కామెడీ. హీరోయిన్ గా చేసిన రూప కొడవాయుర్ మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా తన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా నటించింది. ముఖ్యంగా ప్రేమించిన వాడి కోసం ఇబ్బంది పడుతునే, అతనే తన భర్త అనుకునే క్యారక్టర్ లోని తన నటన చాలా మెచ్యూర్డ్ గా ఉంది. వెన్నెల కిషోర్ చాలా సినిమాల తర్వాత లాంగ్ టైం క్యారక్టర్ లో కనపడి తన స్టైల్ ఆఫ్ కామెడీ తో నవ్వులు పూయించాడు. జిగ్నేశ్వర్ నంద గా అవసరాల శ్రీనివాస్ కూడా ఒక రేంజ్ పెర్ఫార్మ్స్ ని ఇచ్చాడు. తన గెటప్ కూడా కొత్తగా చాలా బాగుంది. తనికెళ్ళభరణి, నరేష్, వడ్డమాని శ్రీనివాస్, కల్పలత, వైవా హర్షతో పాటు మిగతా నటీనటులందరు కూడా తమ నటనతో సినిమాకి నిండు తనాన్ని తెచ్చారు. ఫొటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్. ఫస్ట్ సాంగ్   డాన్స్ కంపోజ్ అయితే మైండ్ బ్లోయింగ్ . నిర్మాణ విలువలు కూడా ఎంతో బాగున్నాయి. ఈ మూవీతో బ్యానర్ ప్రతిష్ట  మరింత పెరిగిందని చెప్పవచ్చు.

ఫైనల్ గా చెప్పాలంటే మండువేసవిని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోకుండా ఉండటానికే  సారంగపాణి జాతకం థియేటర్స్ లోకి వచ్చింది. వంద శాతం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.


రేటింగ్: 3 / 5                                                                                                    

అరుణాచలం