Read more!

English | Telugu

లేడీ పోలీస్‌తో రవితేజ దొంగ ప్రేమ.. మేటర్ లీక్!

మాస్ మహారాజ రవితేజ దొంగగా మారబోతున్నాడు. లేడీ పోలీస్ తో ప్రేమాయణం కూడా నడపబోతున్నాడు. అయితే ఇదంతా కూడా కె.వి. అనుదీప్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే.

'జాతిరత్నాలు' సినిమాతో.. దర్శకుడు అనుదీప్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. నిజానికి అది ఆయనకు రెండో సినిమా. 'పిట్టగోడ' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనుదీప్. కానీ ఆ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత 'జాతిరత్నాలు'తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తీసి, ఘన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం 'ప్రిన్స్' సినిమాతో నిరాశపరిచిన అనుదీప్.. ఇప్పుడు తన నాలుగో సినిమాని రవితేజతో చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, స్టోరీ లైన్ లీక్ అయ్యాయి. ఈ చిత్రానికి 'దొంగ-పోలీస్' అనే టైటిల్ ఖరారు చేశారట. ఇందులో రవితేజ దొంగగా, హీరోయిన్ పోలీస్ గా కనిపిస్తారట. దొంగ-పోలీస్ మధ్య ప్రేమాయణమే ఈ సినిమా కథట. అప్పట్లో 'దొంగోడు' సినిమాలో దొంగగా నవ్వులు పంచిన రవితేజ.. ఇప్పుడు మరోసారి దొంగగా మారబోతున్నాడన్నమాట.

రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే సందడిగా ఉంటుంది. అలాంటి రవితేజ.. 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తో చేతులు కలిపితే కామెడీ పీక్స్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ ఇద్దరు కలిసి 'దొంగ-పోలీస్'తో ఏ రేంజ్ లో నవ్వులు పంచుతారో చూడాలి.