English | Telugu

ధనుష్‌, ఐశ్వర్యలను కలిపిన కొడుకు.. ఎమోషనల్‌ అయిన రజినీకాంత్‌!

ధనుష్‌, ఐశ్వర్యలను కలిపిన కొడుకు.. ఎమోషనల్‌ అయిన రజినీకాంత్‌!

తన అభిమానులకు షాక్‌తో కూడిన సంతోషాన్ని అందించారు తలైవా రజినీకాంత్‌. కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌ తన మనవడు యాత్రతో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రజినీ నుంచి ఈ తరహా పోస్ట్‌ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. దీంతో అభిమానులు ఆనందంతో ఆ ఫోటోను షేర్‌ చేస్తుండడంతో అది వైరల్‌గా మారింది. తాము డైవర్స్‌ తీసుకోబోతున్నట్టు ప్రకటించిన తర్వాత మళ్ళీ ధనుష్‌, ఐశ్వర్య కలిసిన సందర్భం ఇదే. దీనిపై రజినీకాంత్‌ చాలా ఎమోషనల్‌ అయినట్టు తెలుస్తోంది. ‘ఫస్ట్‌ మైల్‌స్టోన్‌ క్రాస్డ్‌ మై లవబుల్‌ గ్రాండ్‌ సన్‌. కంగ్రాట్యులేషన్స్‌ యాత్ర కన్నా..’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రజినీ. 

2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్‌, ఐశ్వర్య.. 2022 జనవరిలో తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. 18 ఏళ్ళ వైవాహిక జీవితం, ఇద్దరు కుమారులు. వారి నుంచి అలాంటి ప్రకటన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా ప్రకటించిన నాటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. 2024 ఏప్రిల్‌లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇద్దరినీ కాంప్రమైజ్‌ చెయ్యాలని కోర్టు ఎంతో ప్రయత్నించింది. కానీ, కలిసి ఉండేందుకు వారు అంగీకరించకపోవడంతో 2024 నవంబర్‌ 27న కోర్టు విడాకులు మంజూరు చేసింది. పిల్లలకు మాత్రం తల్లిదండ్రులుగానే ఉంటామని కోర్టులో చెప్పినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సందర్భంగా కలుసుకున్నారు. స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమం శనివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులను హత్తుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు యాత్ర. 

ధనుష్‌ అభిమాన హీరో రజినీకాంత్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్నా, రజినీపై తనకు ఉన్న అభిమానాన్ని దూరం చేసుకోలేదు. రజినీ కొత్త సినిమా రిలీజ్‌ అయ్యిందంటే మొదటి రోజు మొదటి షోకి వెళ్లి చూసేస్తాడు. అలాగే తన కుమార్తెకు విడాకులు ఇచ్చాడన్న కోపాన్ని ధనుష్‌పై చూపించే ప్రయత్నం రజినీకాంత్‌ ఎప్పుడూ చెయ్యలేదు. ప్రస్తుతం ధనుష్‌ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగార్జునతో కలిసి నటించిన కుబేర ఈనెలలోనే విడుదల కాబోతోంది. ఇక రజినీకాంత్‌ కూడా రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. కూలీ, జైలర్‌2 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో కూలీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఇదే ఏడాది రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.