Read more!

English | Telugu

ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్!

ప్రస్తుతం తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పలు భారీ తెలుగు సినిమాలు నష్టాలను చూస్తున్నాయి. దానికి కారణంగా సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండటమే కారణమని చెప్పవచ్చు. 'పుష్ప', 'సలార్' వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లతో సత్తా చాటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాలను చూశాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు అన్ని భారీ సినిమాలకు ఎదురవుతోంది.

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తోంది. దీంతో స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఆ బడ్జెట్ కి తగ్గట్టుగానే థియేట్రికల్ బిజినెస్ భారీగా జరుగుతోంది. ఆ మొత్తాన్ని రాబట్టడం కోసం.. సినిమా విడుదలైన కొద్దిరోజులు పాటు టికెట్ ధరలను పెంచుతున్నారు. తెలంగాణలో సాధారణంగానే టికెట్ ధరలు అధికంగా ఉన్నాయి. దానికితోడు భారీ సినిమాలకు టికెట్ రేట్ హైక్ బాగానే ఇస్తున్నారు. దాంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న భారీ సినిమాలన్నీ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జగన్ సర్కార్ టికెట్ ధరలను బాగా తగ్గించింది. ఇక భారీ సినిమాలు విడుదల సమయంలో ఆశించిన స్థాయిలో టికెట్ రేట్ హైక్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలున్నాయి. దీంతో పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. పలు భారీ సినిమాలు ఆంధ్రప్రదేశ్ లో నష్టాలను చూస్తున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ప్రభాస్.. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి 2898 AD'. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ని మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ మే 13న ఎన్నికలు ఉండటంతో వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాని జూన్ 4న ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని మూవీ టీం భావిస్తోందట. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం మారితే.. టికెట్ ధరలు పెరిగే అవకాశముంటుందని, అలాగే కొత్త ప్రభుత్వం సినిమా వారి పట్ల సానుకూలంగా ఉంటుందనే అభిప్రాయంలో వారు ఉన్నారట. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే.. 'కల్కి' విడుదల తేదీని లాక్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.