English | Telugu

‘కన్నప్ప’ఇండస్ట్రీ హిట్.. డిప్రెషన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్

‘కన్నప్ప’ఇండస్ట్రీ హిట్.. డిప్రెషన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్

పాన్‌ ఇండియా స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కి వున్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. బాహుబలి, సలార్‌, కల్కి వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్‌. మధ్యలో సాహో, ఆదిపురుష్‌ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచినా ప్రభాస్‌ ఇమేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అతని రాబోయే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అలాగే స్పిరిట్‌, ఫౌజీ, సలార్‌2 ప్రభాస్‌ రాబోయే సినిమాలు. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్‌.. తాజాగా విడుదలైన ‘కన్నప్ప’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించారు. ఒక విధంగా ఈ సినిమాకి ప్రభాస్‌ వల్లే క్రేజ్‌ వచ్చిందని చెప్పాలి. టీజర్‌లో, ట్రైలర్‌లో ప్రభాస్‌ కనిపించడంతో ఆ క్రేజ్‌ మరింత పెరిగింది. ఇప్పుడు సినిమా రిలీజ్‌ అయి అన్ని ఏరియాల్లోనూ సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్‌ చెప్పిన ఒక డైలాగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిపై రకరకాల కామెంట్స్‌ చేస్తూ, వాటిని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌.

‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్‌ పోషించిన పాత్ర పేరు రుద్ర. సినిమాలోని ఒక సందర్భంలో కన్నప్ప, రుద్ర మధ్య పెళ్లికి సంబంధించిన డిస్కషన్‌ వస్తుంది. ‘నీకు పెళ్ళయిందా?’ అని రుద్రను అడుగుతాడు కన్నప్ప. దానికి రుద్ర ‘నా పెళ్లి గురించి ఎందుకులే..’ అంటాడు. ఈ డైలాగ్‌ చెప్పగానే ప్రేక్షకులు, అభిమానుల కేకలతో, విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. 45 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌ లైఫ్‌ని గడుపుతున్న ప్రభాస్‌కి సినిమాలోని డైలాగ్‌ బాగా కనెక్ట్‌ అవ్వడంతో ఆడియన్స్‌ రియాక్షన్‌ ఆ రేంజ్‌లో ఉంది. ఆ డైలాగ్‌ను ప్రభాస్‌ రియల్‌ లైఫ్‌కి రిలేట్‌ చేస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. నిజంగానే ప్రభాస్‌ తన పెళ్లిని లైట్‌ తీసుకుంటున్నాడా.., పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా అంటున్నారు. తన మనసులో ఉన్న మాటను సినిమాలోని డైలాగ్‌ ద్వారా చెప్పించారా అని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. 

‘కన్నప్ప’ సినిమాలోని డైలాగ్‌ని ప్రభాస్‌ లైఫ్‌కి రిలేట్‌ చేస్తూ.. దాన్ని వైరల్‌ చెయ్యడానికి కారణం లేకపోలేదు. ఎంతోకాలంగా ప్రభాస్‌ పెళ్లి అంటూ అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్‌ బాగా స్ప్రెడ్‌ అయింది. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి ప్రభాస్‌, అనుష్కల పెళ్లిని ఎఐలో చేసేశారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా వైరల్‌ చేశారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలాదేవి ఆమధ్య ప్రభాస్‌ పెళ్లి గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ సంవత్సరమే ప్రభాస్‌ పెళ్లి చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. ఇది జరిగి చాలా కాలమైంది. మళ్ళీ ఇప్పటివరకు ఆ ప్రస్తావన లేదు. దాంతో ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌ పెళ్లిని ఉద్దేశించే ఆ డైలాగ్‌ పెట్టి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. ఈ న్యూస్‌ బాగా వైరల్‌ అయింది. మరి ఇప్పటికైనా ప్రభాస్‌ పెళ్లికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.