Read more!

English | Telugu

"ఒక మనసు" సినిమా రివ్యూ!

 

నటీనటులు:

నాగశౌర్య, నిహారిక కొణిదెల, రావు రామేష్, అవసరాల శ్రీనివాస్, ప్రగతి, వెన్నెల కిషోర్, మిర్చి హేమంత్ తదితరులు...

సాంకేతికవర్గం:

సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
కూర్పు: ధర్మేంధ్ర కాకరాల
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: రామరాజు
విడుదల తేది: 24/6/2016

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి కథానాయకి నిహారిక. ఇదివరకే కొన్ని షార్ట్ ఫిలిమ్స్, టీవి షోస్ చేసినప్పటికీ.. నిహారిక ఎంట్రీ కోసం మెగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. "మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు" ఫేమ్ రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన "ఒక మనసు" ద్వారా నిహారిక ఎంట్రీ జరిగింది. నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఓ స్వచ్చమైన ప్రేమకథని, "మరో చరిత్ర" స్థాయి సినిమా అని దర్శకుడు మాత్రమే కాక హీరోహీరోయిన్లు కూడా ప్రమోట్ చేశారు.

మరి "ఒక మనసు" వారు చెప్పినట్లుగా "మరో చరిత్ర" స్థాయిలో ఉందా ?

నిహారికా వెండితెర ఎంట్రీ సక్సెస్ అయ్యిందా ?

అసలు "ఒక మనసు" ప్రేక్షకుల మనసుల్ని దోచుకొంటుందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మా రివ్యూను చదవాల్సిందే..!!

కథ:
సూర్య (నాగశౌర్య) తన తండ్రి కోరిక మేరకు ఎమ్మెల్యే అవ్వడమే జీవితాశయంగా మెలిగే యువకుడు. విజయనగరంలో చిన్న చిన్న సెటిల్ మెంట్లు చేస్తుంటాడు. డాక్టర్ కోర్స్ చదువుతూ.. ట్రైయినింగ్ కోసం విజయనగంలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేసేందుకు వస్తుంది సంధ్య (నిహారిక కొణిదెల). తొలి చూపులోనే సూర్యని ఇష్టపడుతుంది. ఆ ఇష్టాన్ని బయటపెట్టకుండా తనలోనే దాచేసుకొని, అతడ్ని చూస్తూ ఉంటుంది. ఈలోగా సంధ్య ఇష్టాన్ని గమనించిన సూర్య.. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలోకి అనుకోని విధంగా ఎదురైన ఓ సమస్య కారణంగా సూర్య జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మూడేళ్లు జైల్లో ఉండి వచ్చిన సూర్యతో తన కూతురు సంధ్యను ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోదు ఆమె తల్లి. చివరికి సూర్య-సంధ్యల ప్రేమకథకు ఎటువంటి ముగింపు లభించింది? అనేది క్లుప్తంగా సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

సినిమా హీరో నాగశౌర్య అయినప్పటికీ.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ కావడంతో ముందుగా నిహారిక గురించి మాట్లాడుకుందాం. చూడ్డానికి లక్షణంగా ఉంది, హావభావాల ప్రదర్శన విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం చాలా ఉంది. అయితే మొదటి సినిమా కాబట్టి ఆమె నటనకు పాస్ మార్కులు వేయవచ్చు. సూర్య పాత్రలో నాగశౌర్య చాలా సెటిల్డ్ గా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే హావభావాల్ని పలికించాడు. తండ్రి పాత్రలో రావురమేష్, స్నేహితుడి పాత్రలో శ్రీనివాస్ అవసరాల తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లి పాత్రలో ప్రగతి నటన కాస్త అతిగా అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రధారుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు:

సునీల్ కశ్యప్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అయితే.. చాలా పాటల్ని మాంటేజ్ సాంగ్స్ లా తెరకెక్కించడం వల్ల, వింటున్నప్పుడు కలిగిన అనుభూతి చూస్తున్నప్పుడు ఆస్వాదించలేము. నేపధ్య సంగీతం వినసోంపుగా ఉంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ "ఒక మనసు" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. ప్రకృతి అందాలతోపాటు నటీనటులను కూడా చక్కగా చిత్రీకరించాడు. సినిమా మొత్తం దాదాపుగా సాగుతున్నట్లుగానే ఉంటుంది. సో, ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల తన కత్తెరకి ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

"నేను ఇలాగే సినిమా తీస్తాను, నా సినిమాలు ఇలాగే ఉంటాయి" అని ప్రేక్షకుడి మనసులో ముద్ర వేయడానికే రామరాజు "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు" తర్వాత "ఒక మనసు" సినిమాను తీసినట్లు అనిపిస్తుంది. అసలే కథ లేదు అని ప్రేక్షకుడు సీట్ లో చాలా ఇబ్బందిగా కదిలే ప్రేక్షకుడ్ని.. నత్త నడకలా సాగిన కథనం ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఆసక్తికరమైన అంశం ఒక్కటి కూడా కనపడదు. దర్శకుడు కేవలం నిహారిక-నాగశౌర్యల క్యారెక్య్తర్ల మీద, వాళ్ళ చేష్టల మీద పెట్టిన ధ్యాస కథ-కథనంపై కూడా పెట్టి ఉంటే బాగుండేది. ఇది "మరో చరిత్ర" స్థాయి సినిమా అని దర్శకుడు పదే పదే చెప్పాడు. ఏ కోణంలోనూ "మరో చరిత్ర" కాలి గోటికి కూడా "ఒక మనసు" సరిపోదు. "మరో చరిత్ర" ప్రేమతోపాటు చాలా అంశాల మేళవింపు. కేవలం క్లైమాక్స్ ను విషాదభరితంగా ముగించినంతమాత్రన "ఒక మనసు" చిత్రాన్ని "మరో చరిత్ర"తో కంపేర్ చేయడం సరికాదు.   

విశ్లేషణ:

సినిమా మొత్తానికి.. నిహారిక-నాగశౌర్యల కెమిస్ట్రీ మినహా చెప్పుకోదగ్గ విషయం ఏమీ ఉండదు. మాస్ ఆడియన్స్ ఈ సినిమా దరిదాపులకు కూడా రారు, క్లాస్ ఆడియన్స్ థియేటర్ లో కూర్చోలేరు. ఓవరాల్ గా కేవలం "నిహారిక" హీరోయిన్ మెటీరీయల్ అని పరిచయం చేయడానికి మాత్రమే "ఒక మనసు" తీశారు తప్ప ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి కాదని సినిమా చూస్తున్న మొదటి 20 నిమిషాలకే తెలిసిపోతుంది. అందువల్ల విపరీతమైన ఓపిక ఉంటే తప్ప.. "ఒక మనసు" చిత్రానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం!

రేటింగ్: 2.25/5