Read more!

English | Telugu

అదిరిపోయే డేట్ కి వస్తున్న 'కల్కి'.. ఈ దెబ్బకి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

'బాహుబలి-2' తరువాత వసూళ్ల పరంగా ఆ స్థాయిలో సంచలనాలు సృష్టించగల చిత్రమని అందరూ బలంగా నమ్ముతున్న సినిమా 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) అని చెప్పవచ్చు. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా ఎన్నికల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్.. ఈ మూవీకి అదిరిపోయే కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేశారని సమాచారం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కల్కి 2898 AD'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె సహా వివిధ భాషలకు చెందిన ఎందరో స్టార్లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగా ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకే ప్రభాస్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో అందరూ నిరాశచెందారు. పైగా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో మరింత డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఎట్టకేలకు 'కల్కి' కొత్త విడుదల తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేయనున్నారట.

జూన్ 7 అనేది అన్ని రకాలుగా పర్ఫెక్ట్ డేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఎన్నికలు ఫలితాలు జూన్ 4న రానున్నాయి. అప్పటిదాకా రాజకీయాలపై ఉన్న ప్రజల దృష్ట్రంతా.. ఆ తర్వాత మళ్ళీ సినిమాల వైపు మళ్లుతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఈ సమ్మర్ సీజన్ లో స్టార్ హీరోల సినిమాల సందడి లేదు. దీంతో ఎప్పుడెప్పుడా బడా స్టార్ సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి తోడు, జూన్ 7వ తేదీ అంటే.. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్, కాలేజ్ లు ఓపెన్ కావడానికి వారం పది రోజుల ముందు. దీంతో తమ పిల్లలు మళ్ళీ చదువులతో బిజీ కావడానికి ముందు.. వినోదం కోసం వారిని సినిమాకి తీసుకెళ్లాలని భావించే పేరెంట్స్ ఎందరో ఉంటారు. ఓ వైపు ఎన్నికల హడావుడి ముగిసిపోవడం, మరోవైపు విద్యాసంస్థల రీ-ఓపెన్ కి కొద్దిరోజుల ముందు కావడం, ఇంకో పక్క చాలారోజులుగా పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం.. ఇవన్నీ కలిసొచ్చి 'కల్కి 2898 AD' కి సంచలన ఓపెనింగ్స్ వచ్చే అవకాశముంది. మొత్తానికి మేకర్స్ అన్ని ఆలోచించి సరైన తేదీని లాక్ చేశారని చెప్పవచ్చు.