Read more!

English | Telugu

ఎన్టీఆర్ బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇచ్చిన హృతిక్ రోషన్!

నేడు(మే 20) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అందరిలోనూ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా' అంటూ తెలుగులో విష్ చేసిన హృతిక్.. 'వార్-2' గురించి హింట్ కూడా ఇవ్వడం విశేషం.

ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు ఫ్యాన్స్ కి మరింత ప్రత్యేకంగా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'దేవర' మూవీ ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 'సింహాద్రి' సినిమా రీరిలీజ్ కావడంతో అభిమానుల హంగామాతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్  అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా తాజాగా హృతిక్ ఓ ట్వీట్ చేశాడు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న 'వార్-2'లో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ పంచుకోనున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రానప్పటికీ 'వార్-2'లో ఎన్టీఆర్ నటించడమైతే ఖరారైంది. తాజాగా హృతిక్ సైతం ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు తారక్. యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా" అంటూ 'వార్-2' గురించి హింట్ ఇచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం హృతిక్ ట్వీట్ వైరల్ గా మారింది.