Read more!

English | Telugu

సరిలేరు నీకెవ్వరు.. ఏ పాట రాయాలన్నా.. నీ స్టైలే వేరు!

తెలుగు సినిమాకి ఎంత వయసు ఉంటుందో.. తెలుగు సినిమా పాటకి కూడా అంతే వయసు ఉంటుంది. ఎందుకంటే సినిమాకి, పాటకి వున్న బంధం అలాంటిది. పాటలు లేకుండా.. సినిమాను ఊహించుకోలేడు తెలుగు ప్రేక్షకుడు. అందుకే దర్శకనిర్మాతలు కథ, కథనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో పాటలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఒకప్పటి తెలుగు సినిమా పాటకు, ఇప్పటి పాటకు ఎంతో వ్యత్యాసం ఉంది. కాలం మారుతోంది, తరాలు మారుతున్నాయి, ప్రేక్షకుల అభిరుచిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దానికి తగ్గట్టుగానే తమ పాటల్ని మార్చుకుంటూ వస్తున్నారు గేయరచయితలు. పాత తరంలో ఎంతో మంది గొప్ప రచయితలు తెలుగు సినిమా పాటకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఈ జనరేషన్‌లో వస్తున్న పాటల్లో సాహిత్యం కంటే సంగీతమే ఎక్కువగా వినిపిస్తోందన్న ఆరోపణ ఉంది. అయినా, అప్పుడప్పుడు సాహిత్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ కొన్ని పాటలకు స్వరాలు సమకూరుస్తున్నారు సంగీత దర్శకులు. 

ఈ తరం రచయితల్లో సాహిత్యానికి, సామాజిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తన పాటలతో ఎంతో మంది గేయ రచయితలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చంద్రబోస్‌. ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా..’ అనే పాటతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన చంద్రబోస్‌.. టాలీవుడ్‌లోని అందరు హీరోలకు పాటలు రాశారు. తెలుగు వారు ఆస్కార్‌ అవార్డు సాధించే ఆస్కారమే లేదు అన్న వారికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ సాధించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాపితం చేశారు చంద్రబోస్‌. 29 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు చంద్రబోస్‌. వాటిలో యువతకు స్ఫూర్తినిచ్చే పాటలు, ప్రేమ జంటలు హాయిగా పాడుకునే పాటలు, స్నేహబంధాన్ని చాటి చెప్పే పాటలు, అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పాటలు.. ఇలా అన్ని తరహా పాటలు ఉన్నాయి. మే 10 చంద్రబోస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయా పాటలకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ చిత్రంలోని ‘కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి’ అనే పాట యువతలో స్ఫూర్తిని నింపి ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అలాగే ‘చెన్నకేశవరెడ్డి’లోని ‘నవ్వే వాళ్ళను నవ్వనీ..’, ‘నేనున్నాను’ చిత్రంలోని ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..’ వంటి పాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటూ అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. స్నేహబంధానికి వున్న విలువను చెప్పే పాటల్లో.. ‘ట్రెండు మారినా ఫ్రెండు మారడు’(ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం) పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి. 

ఇక సెంటిమెంట్‌ సాంగ్స్‌ గురించి చెప్పాలంటే.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ (నాని), లాలి లాలి జోలాలి (ఢమరుకం), కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా (మనం), మరుమల్లి జాబిల్లి (లక్ష్మీనరసింహా), అన్నయ్యా అన్నావంటే (అన్నవరం) వంటి పాటలు జనం మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన రామ్‌చరణ్‌ సినిమా ‘రంగస్థలం’ చిత్రంలోని ‘ఓరయ్యో.. నా అయ్యా..’ అనే ఓ అద్భుతమైన పాటను రచించడమే కాకుండా స్వయంగా తానే గానం చేశారు చంద్రబోస్‌. ఈ పాటను విని కంటతడి పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే రవితేజ హీరోగా వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమెరీస్‌’ చిత్రంలోని ‘గుర్తుకొస్తున్నాయి..’ పాట ఇప్పటికీ జనం పాడుకుంటున్నారు.  ఇక చంద్రబోస్‌ రాసిన ప్రేమ పాటల గురించి చెప్పక్కర్లేదు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి (ఆది), కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని (నువ్వొస్తావని), నువు చూడూ చూడకపో (ఒకటో నెంబర్‌ కుర్రాడు), నువ్వే నా శ్వాస (ఒకరికొకరు) వంటి పాటలు ప్రేమికుల హృదయాలను దోచుకున్నాయి. ఈ క్రమంలోనే 2021లో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలోని ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ..’ పాట ఒక ఊపు ఊపేసింది. ఇదీ అదీ అని కాకుండా.. ఏ తరహా పాటనైనా తన అందమైన మాటలతో అల్లుకుంటూ వెళ్ళే చంద్రబోస్‌ ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగువన్‌.