English | Telugu
బాలయ్య, మోక్షజ్ఞ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Updated : May 6, 2025
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ-2 చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు. అంతేకాదు, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు.. 'ఆదిత్య 999'. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. (Aditya 999)
'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే, ఈ చిత్రంలో తన కుమారుడు మోక్షజ్ఞ (Mokshagna) కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల 'ఆదిత్య 999' ఆలస్యమవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు.. దర్శకుడిగా సినిమా చేసే అంత సమయం దొరకడం అంత తేలిక కాదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ఏవో రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆదిత్య 999 తెరపైకి వచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో బాలయ్యతో మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే.. మొదట ఇలా తనతో కలిసి నటిస్తే షూటింగ్ వాతావరణం మోక్షజ్ఞకు అలవాటు అవుతుంది అనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.
'ఆదిత్య 999'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వయంగా తానే దర్శకత్వం వహించాలని బాలయ్య భావించారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర బాధ్యతలను దర్శకుడు క్రిష్ కి అప్పగించడం విశేషం. క్రిష్-బాలకృష్ణ గతంలో కలిసి పని చేశారు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఆ తర్వాత 'కథానాయకుడు', 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఇప్పుడిది వీరి కాంబోలో నాలుగో సినిమా కానుంది.
సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కనున్న 'ఆదిత్య 999'ను 'బాహుబలి'ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనుందట. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా 'వేదం'.. ఆర్కా బ్యానర్ లోనే రూపొందటం విశేషం.
క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో 'ఘాటీ' సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత 'ఆదిత్య 999' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ ఏడాది డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలున్నాయి.
