Read more!

English | Telugu

భర్త ఎదుటే హీరోయిన్‌పై దాడి.. ముఖ్యమంత్రి సపోర్ట్!

సెలబ్రిటీలు జనంలోకి రావాలంటే సహజంగానే భయపడతారు. స్క్రీన్‌పైన, టీవీలో కనిపించే వారు ఎదురుగా కనిపిస్తే వారితో మాట్లాడాలని, ఫోటోలు దిగాలని అనుకోవడం సహజం. అలా కాకుండా కొందరు కావాలని వారిపై దాడి చేసిన ఘటనలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటివి చాలామంది సెలబ్రిటీల విషయంలో జరిగాయి. తాజాగా అలాంటి ఓ ఘటన ఓ హీరోయిన్‌ విషయంలో జరిగింది. కన్నడ నటి హర్షిక పుణ్యచ్చ, ఆమె భర్త ఇంకా కుటుంబ సభ్యులంతా డిన్నర్‌ చేయడం కోసం బయటికి వచ్చారు. ఆ సమయంలో కొందరు దుండగులు వారిపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దోపిడీకి కూడా యత్నించారు. ఈ విషయాన్ని హర్షిక సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది. 

‘ఇటీవల నేను, నా భర్త, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి డిన్నర్‌ చేసేందుకు బయటకు వచ్చాం. డిన్నర్‌ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేందుకు కారులో కూర్చోగానే కొందరు వ్యక్తులు మాపై దాడికి దిగారు. వారిలో ఇద్దరు బూతులు తిడుతూ నన్ను టచ్‌ చేసేందుకు ట్రై చేశారు. నా భర్త అడ్డుకోవడంతో ఆయన్ని ముఖం మీద గుద్దారు. కారులో ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నారన్న కారణంతో నా భర్త వారితో ఎంతో సామరస్యంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటికి మరో 30 మందికిపైగా వచ్చి మా దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని దోచుకునేందుకు ట్రై చేశారు.  నా భర్త మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొవడానికి ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే తన మెడలో నుంచి తీసి దాన్ని నాకు ఇచ్చారు. వారు మా కారును ధ్వంసం చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. మాకు తెలిసిన ఇన్‌స్పెక్టర్‌కి కాల్‌ చేశాను. అది గమనించి వారు అక్కడి నుంచి పారిపోయారు. దగ్గరలో ఒక పెట్రోలింగ్‌ వాహనం కనిపించడంతో అందులో ఉన్న ఆఫీసర్‌కి ఘటన గురించి చెప్పాం. కానీ, అతను అవేవీ పట్టించుకోకపోగా పై ఆఫీసర్స్‌తో మాట్లాడాలి అనిచెప్పాడు. జరిగింది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు’ అని వివరించింది హర్షిక. 

ఈ ఘటనపై పోలీసుల వివరణ మరోలా ఉంది. ఈ ఘటన గురించి తమకు ఎలాంటి కంప్లయింట్‌ రాలేదని పోలీసులు అంటున్నారు. బాధితుల్ని సంప్రదించి ఫిర్యాదు చెయ్యాల్సిందిగా కోరామని, అయితే దానికి కొంత సమయం కావాలని వారు కోరినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలేమిటో, ఎవరు ఈ దాడికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. హీరోయిన్‌పై దాడి విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఈ ఘటనపై విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.