English | Telugu
'అఖండ-2' టీజర్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
Updated : Apr 23, 2025
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. ఇప్పుడు వీరి కలయికలో నాలుగో సినిమాగా 'అఖండ-2' రూపొందుతోంది. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానున్న అఖండ-2 కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ రాబోతుందని తెలుస్తోంది. (Akhanda 2 Teaser)
'అఖండ-2' టీజర్ రిలీజ్ డేట్ లాక్ అయిందట. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న టీజర్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ టీజర్ తర్వాత 'అఖండ-2'పై అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయమని అంటున్నారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో భారీస్థాయిలో 'అఖండ-2' రూపొందుతోంది. హిమాలయాలు సహా పలు అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. మే నెల అంతా అక్కడే షూటింగ్ చేయనున్నారని వినికిడి.
షూటింగ్ దశలో ఉండగానే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ అనే తేడా లేకుండా 'అఖండ-2'కి అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశముంది. ప్రస్తుతం 'అఖండ-2'పై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే.. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
