Read more!

English | Telugu

శ్రీలీల జోరు.. కృతి శెట్టి బేజారు!

సినీ పరిశ్రమలో క్రేజ్ రావడం ఎంత కష్టమో, దానిని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ప్రస్తుతం యంగ్ బ్యూటీ కృతి శెట్టి అలాంటి కష్టాన్నే అనుభవిస్తోంది. 'ఉప్పెన'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన కృతి మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో పోషించిన బేబమ్మ పాత్రతో యూత్ కి బాగా దగ్గరైంది. దాంతో వరుస అవకాశాలు ఆమెని వరించాయి. 'ఉప్పెన' తర్వాత 'శ్యామ్‌ సింగరాయ్‌', 'బంగార్రాజు' సినిమాలతోనూ అలరించి హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. ఇదే జోరు కొనసాగితే త్వరలో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అలాంటి తరుణంలో కృతిని వరుస పరాజయాలు పలకరించాయి.

కృతి నటించిన గత నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలుగా మిగిలాయి. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'ది వారియర్', 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ని ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల విడుదలైన 'కస్టడీ'పై ఆమె ఎన్నో పెట్టుకోగా.. అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుస పరాజయాలతో కృతి క్రేజ్ తగ్గిపోతోంది. 'ఉప్పెన' సమయంలో ఆమె స్టార్ గా ఎదుగుతుందని భావించిన వాళ్ళు సైతం.. ఇప్పుడసలు ఆమె ఇంకొన్నాళ్ళైనా ఇండస్ట్రీలో నిలబడుతుందా అని సందేహపడుతున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో శర్వానంద్ సరసన కృతి నటిస్తోంది. ఈ సినిమా విజయం కృతి కెరీర్ కి కీలకం. అది కూడా పరాజయం పాలైతే ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది.

ఓ వైపు కృతి పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు తనతో పాటే కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల మాత్రం ఫుల్ జోష్ లో ఉంది. 'ఉప్పెన'తో కృతి, 'పెళ్లిసందడి'తో శ్రీలీల 2021 లోనే కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే మొదట్లో కృతికి వచ్చిన క్రేజ్ శ్రీలీలకు రాలేదు. కానీ కృతిని వరుస పరాజయాలు పలకరించడం, 'ధమాకా'తో శ్రీలీల బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. వరుస ఆఫర్లు శ్రీలీలను చుట్టుముట్టాయి. ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండటం విశేషం. 'ఉప్పెన' తర్వాత కృతి యంగ్ హీరోల సినిమాలకే పరిమితమైతే.. శ్రీలీల మాత్రం యంగ్ హీరోలతో పాటు స్టార్స్ సినిమాలలో కూడా నటించే అవకాశం దక్కించుకుంటోంది. ఇప్పుడు శ్రీలీల స్పీడ్ ని కృతి అందుకోవాలంటే ఖచ్చితంగా ఓ సాలిడ్ హిట్ అందుకొని రేసులోకి రావాలి. లేదంటే పూర్తిగా వెనకబడిపోతుంది.