Read more!

English | Telugu

సినిమా పేరు:యాత్ర 2
బ్యానర్:త్రీ ఆటమ్‌ లీవ్స్, వి సెల్యూలాయిడ్‌
Rating:1.50
విడుదలయిన తేది:Feb 8, 2024

సినిమా పేరు: యాత్ర 2
తారాగణం: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్, మహేష్ మంజ్రేకర్, సుజానే బెర్నెర్ట్, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్ 
సినిమాటోగ్రాఫర్: ఆర్ మధి 
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
రచన, దర్శకత్వం: మహి వి రాఘవ
నిర్మాత: శివ మేక
బ్యానర్స్: త్రీ ఆటమ్‌ లీవ్స్, వి సెల్యూలాయిడ్‌
విడుదల తేదీ: ఫిబ్రవరి 8, 2024

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' చిత్రం 2019లో విడుదలై బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలినప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులకు ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వైఎస్సార్ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర -2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:
'యాత్ర' సినిమాలో పాదయాత్ర ద్వారా వైఎస్సార్(మమ్ముట్టి) ప్రజల్లోకి వెళ్ళడం, ముఖ్యమంత్రి అవ్వడం వంటి అంశాలను ప్రధానంగా చూపించారు. 'యాత్ర 2' విషయానికొస్తే.. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జీవా) రాజకీయంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను అధిష్టానం ఎందుకు వ్యతిరేకించింది? తన తండ్రి వీరవిధేయత చూపించిన ప్రోగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు రావడానికి కారణమేంటి? అతన్ని జైలుపాలు చేసింది ఎవరు? ఎంపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జగన్.. ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు? వంటి అంశాలను 'యాత్ర 2'లో చూపించారు.


ఎనాలసిస్ :

కథగా చూస్తే 'యాత్ర 2'లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీలేదు. పైగా ఇదేమీ కొన్ని దశాబ్దాల క్రితం జరిగినది కాదు. గత పది పదిహేనేళ్ల కాలంలో జరిగినదే. వైఎస్సార్ మరణం నుండి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన సంఘటనల గురించి.. మీడియా ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో దాదాపు అందరికీ అవగాహన ఉంది. ఇలా జనాలకు బాగా తెలిసిన కథని సినిమాగా తీయాలనుకున్నప్పుడు.. వాస్తవాలకు దగ్గరగా ఉంటూనే.. కథనం, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండేలా రాసుకోవాలి. కానీ ఈ విషయాల్లో దర్శకుడు మహి వి రాఘవ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక వర్గానికి లబ్ది చేకూర్చడం కోసమో, ఒక వర్గాన్ని సంతోషపరచడం కోసమో అన్నట్టుగా వాస్తవాలకు దూరంగా సినిమాని మలిచాడు.

ఒక వ్యక్తిని హీరో అని చెప్పాలంటే.. అతని గొప్పతనాన్ని, అతను చేసిన మంచిని చూపిస్తే సరిపోతుంది. అంతేగాని ఆ వ్యక్తి తప్ప మిగతా వారందరూ దుర్మార్గులు, అతనొక్కడే శుద్ధ పూస అన్నట్టుగా చెప్పకూడదు. కానీ 'యాత్ర 2' విషయంలో అదే జరిగింది. ఒక వ్యక్తికి స్వతహాగా హీరో లక్షణాలు ఉంటే, అతన్ని ఆటోమేటిక్ గా అందరూ హీరో అంటారు. దాని కోసం ఇతరులను విలన్స్ గా చూపించాల్సిన అవసరంలేదు. కానీ జగన్ ని హీరో చేయడం కోసం సోనియా గాంధీ, చంద్రబాబు సహా ఎందరో రాజకీయ ప్రముఖులను చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కొన్ని కొన్ని సన్నివేశాలు ఏమాత్రం నమ్మశక్యంగా లేవు. ఒకసారి సోనియా గాంధీ తన టీం టైంలో అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన పీఎం మన్మోహన్ సింగ్ ని డోర్ దగ్గర నిల్చోబెట్టడం వంటి సన్నివేశాలు కావాలని రాసుకున్నట్టుగా ఉన్నాయి. అలాగే, అప్పుడు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయిలో సోనియా గాంధీ ఉంది. అలాంటి సోనియాని జగన్ అంతు చూడటమే ఆమె లక్ష్యం అన్నట్టుగా, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా కూడా జగన్ సీఎం కానందుకు ఆమె సంతోషపడినట్టుగా చూపించడం మరీ సినిమాటిక్ గా ఉంది. చంద్రబాబుకి కుళ్ళు కుతంత్రాలు తప్ప ఏమీ తెలియదు అన్నట్టుగా చూపించడం కూడా మరీ దారుణంగా ఉంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే.. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలుకి వెళ్లిన సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది ఆయన సోదరి వైఎస్ షర్మిల అనేది కాదనలేని సత్యం. అలాంటిది ఈ సినిమాలో అసలు ఆమె పాత్రనే చూపించలేదు. జగన్ ని విభేదించిన కారణంగానే.. షర్మిలకి క్రెడిట్ రాకూడదన్న ఉద్దేశంతో ఆమె పాత్రని సినిమాలో చూపించలేదని స్పష్టంగా అర్థమవుతోంది. జరిగిన వాస్తవాలను చూపించడం కంటే కూడా ఒక వ్యక్తికి రాజకీయ లబ్ది చేకూర్చడం కోసమే అన్నట్టుగా ఈ సినిమా ఉంది. 

నాణేనికి రెండు వైపులా అన్నట్టుగా.. ప్రతి కథకి మనం చూసే కోణం కాకుండా మరో కోణం ఉంటుంది. కానీ 'యాత్ర 2' మాత్రం ఒకే కోణంలో గుడ్డిగా సాగిపోతుంది. 2014లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడని, అందుకే 2019 లో ఘోరంగా ఓడిపోయాడని చూపించారు. మరి సంపూర్ణ మధ్య నిషేధం సహా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయాడు అనేది సినిమాలో చూపించలేదు. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సన్నివేశంతో సినిమాని ముగించారు. ఇలా సినిమాలో పాత్రలను, సన్నివేశాలను తమకి అనుకూలంగా, తమకి లాభం చేకూర్చేలా ఉన్నవే చూపించారు. 

వాస్తవాలకు దూరంగా ఉందనే విషయాన్ని పక్కన పెట్టి.. సినిమాని సినిమాలా చూసినా కూడా ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయి. 'యాత్ర'లో కొన్ని కల్పిత పాత్రలు, సన్నివేశాల ద్వారా ఎమోషన్స్ ని పండించడంలో బాగానే సక్సెస్ అయిన మహి వి రాఘవ.. 'యాత్ర 2' విషయంలో మాత్రం చేతులెత్తేశాడు. ఇందులో కూడా కొన్ని కల్పిత పాత్రలు, సన్నివేశాల ద్వారా ఎమోషన్స్ ని పండించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఓవర్ డ్రమటిక్ అయిపోయింది. కొందరు జగన్ అభిమానులకు తప్ప.. సాధారణ ప్రేక్షకులకు అయితే విసుగు తెప్పించేలాగానో, ఏంటి ఈ భజన అనుకునే లాగానో సన్నివేశాలు ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులు రెండు గంటల పాటు ఓపికగా కూర్చొని ఈ సినిమాని వీక్షించడం కష్టమే. ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అసలు మనం థియేటర్ కి వచ్చి సినిమా చూస్తున్నామా? లేక ఇంట్లో కూర్చొని ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నామా? అనే అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల వేళ ఒక పార్టీకి ప్రచారం కల్పించడం కోసం రెండు గంటల నిడివిగల ఏవీని ప్రదర్శించినట్లుగా ఉంది గానీ.. ఎక్కడా సినిమా అనే భావన కలగలేదు.

ఈ సినిమాలో సంభాషణలు బాగానే ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని చోట్ల సంభాషణల కోసమే సన్నివేశాలు రాసుకున్నట్లు ఉంది కానీ.. సన్నివేశాలకు తగ్గట్టుగా సంభాషణలు రాసుకున్నట్టు అనిపించదు. ఆ సంభాషణల మీద పెట్టిన శ్రద్ధ సన్నివేశాల మీద పెట్టినట్లయితే.. మరీ ఇంతలా విసుగు తెప్పించేలా లేకుండా సినిమా కాస్త మెరుగ్గా ఉండేది.

సాంకేతికంగా ఈ సినిమా మెప్పించింది. సంతోష్ నారాయణన్ సంగీతం, ఆర్ మధి కెమెరా పనితనం ఆకట్టుకున్నాయి. అయితే సినిమాలో వ్యక్తి భజన తప్ప, కథాకథనాల్లో విషయం లేకపోవడంతో.. వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.

నటీనటుల పనితీరు:

వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయాడు. పాత్రకు హుందాతనం తీసుకొచ్చాడు. జగన్ పాత్రలో జీవా కూడా చక్కగా రాణించాడు. జగన్ బాడీ ల్యాంగ్వేజ్ ని బాగానే పట్టాడు. జగన్ సతీమణి భారతి పాత్రలో కేతకి నారాయణ్ ఉన్నంతలో మెప్పించింది. మహేష్ మంజ్రేకర్, సుజానే బెర్నెర్ట్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

వాస్తవాలకు దూరంగా తీసిన 'యాత్ర 2' చిత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఈ సినిమాతో జగన్ అభిమానులు కొంతవరకు సంతృప్తి చెందుతారేమో కానీ.. సాధారణ ప్రేక్షకులు మాత్రం విసుగుచెందుతారు. ఒక పార్టీ ప్రచార చిత్రాలనో, న్యూస్ ఛానల్ నో చూస్తున్న ఫీలింగ్ కలిగించిన ఈ సినిమా.. ప్రేక్షకుల మెప్పు పొందటం కష్టమే.