Read more!

English | Telugu

సినిమా పేరు:వినాయకుడు
బ్యానర్:ప్రీం మూవీస్
Rating:3.00
విడుదలయిన తేది:Nov 22, 2008
ఇది రొటీన్‌ కథ మాత్రం కాదు. రాజోలు నుండి హైదరాబాద్‌లో ఉన్న తన అక్కయ్య ఇంటికి వచ్చిన కార్తీక్‌ (కృష్ణుడు)కి అల్తాఫ్‌ (సూర్యతేజ్‌) అనే ఒక ఫ్రెండ్‌ వల్ల యాడ్‌ ఏజన్నీలో ఉద్యోగం వస్తుంది. కార్తీక్‌ చిన్నప్పుడు అందరిలా ఉన్నా, యుక్తవయస్సు రాగానే వారసత్వం కారణంగా చాలా లావుగా ఉంటారు. అదే కంపెనీలో కల్పన (సోనియా) అనే అమ్మాయి కూడా పనిచేస్తుంటుంది. ఆమె చాలా స్లిమ్‌గా, అందంగా, డాషింగ్‌గా ఉంటుంది. ఆమె తన పేరెంట్స్‌ అమెరికా వెళ్ళటం వల్ల తన ఫ్రెండ్‌ శాండ (పూనమ్‌ సింగ్‌) ఫ్లాట్‌లో ఉంటుంది. అదే అపార్ట్‌మెంట్‌లో కార్తీక్‌ కూడా తన అక్కతో ఉంటారు. కార్తీక్‌ తన వెంట వస్తూ వుంటే అపార్థం అపార్థం చేసుకున్న కల్పన అతన్ని తిడుతుంది. ఆ తర్వాత నిజం తెలుసుకుంటుంది. కానీ ఆమెను కార్తీక్‌ ప్రేమిస్తుం టాడు. ఆమెకు రాజీవ్‌ అనే కుర్రాడిని చూడమని తన తండ్రి చెప్పడంతో అతన్ని కలుస్తుంది కల్పన. రాజీవ్‌ ఆరడుగుల అందగాడు, నెలకు లక్షరూపాయల సంపాదన. దాంతో కల్పన తరచూ రాజీవ్‌ని కలుస్తూ వుంటుంది. ఓ సారి రాత్రి బయటకు వెళ్ళిన రాజీవ్‌, కల్పన కూర్చుని మాట్లాడుకుంటుంటే పోలీసులొచ్చి నీచంగా మాట్లాడితే రాజీవ్‌ వాళ్ళకి డబ్బిచ్చి పంపేస్తాడు. దానికి బాధపడిన కల్పన, రాజీవ్‌కి దూరమవుతుంది. దాంతో కార్తీక్‌కి ప్రేమ మీద ఆశలు చిగురిస్తాయి. కల్పన కూడా కార్తీక్‌ అంటే స్నేహంగానే వుంటుంది. కల్పన ఫ్రెండ్‌ శాండని అల్తాఫ్‌ ప్రేమిస్తుంటాడు. ఇలా వారి వారి ప్రేమ కథలు సాగుతూ సఫలమవటం మిగిలిన కథ.
ఎనాలసిస్ :
ఎందుకలో తెలీదు కానీ శేఖర్‌ కమ్ముల స్కూల్‌ నుండి వచ్చిన వారంతా స్లో నెరేషన్‌కి ఎక్కువ ప్రాథాన్యతనిస్తుంటారు. ఈ చిత్ర దర్శకుడు సాయికిరణ్‌ అడవి దగ్గర నుంచీ "ఆవకాయ బిర్యానీ" డైరెక్టర్‌ అనిష్‌ కురువిల్లా వరకూ అంతే. అయితే ఈ చిత్రం "ఆవకాయ బిర్యానీ కన్నా బెటర్‌". కొన్ని సందర్భాలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. ఒక లావుగా ఉండే అబ్బాయికీ, ఒక స్లిమ్‌గా, అందంగా ఉండే అమ్మాయికీ మధ్య ప్రేమ అనే ఆలోచనలోనే నావాల్టీ ఉంది. కార్తీక్‌ తాను లావుగా ఉన్నందుకు తన అక్క దగ్గర బాధపడే సీను, షాలిని (అకింత) కార్తీక్‌తో "నా నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేసిన మాగాడివి నువ్వే కార్తీక్‌" అని చెప్పే మాట ఇలా కొన్ని సీన్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. కామెడీ కూడా ఫరవాలేదు. దర్శకుడు టేకింగ్‌ పరంగా ఒ.కే. కానీ సినిమా ఫస్టాఫ్‌ కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్‌ హాఫ్‌ మాత్రం బెటర్గా ఉంది. నటన :- కార్తీక్‌గా కృష్ణుడు ఫరవాలేదు. కల్పనగా సోనియా బాగా నటించింది. శాండగా నూనమ్‌ కౌర్‌, షాలినిగా అంకిత తమ పాత్రలకు న్యాయం చేశారు. నటి తులసి క్లైమాక్స్‌లో కనపడుతుంది. సీరియస్‌గా ఉండే బాస్‌లా నిర్మాత ప్రేమ్‌కుమార్‌ నటన, అల్తాఫ్‌గా సూర్యతేజ్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కెమెరా :- అద్భుతంగా లేకపోయినా బోర్‌ కొట్టేట్లుగా మాత్రం లేదు. రీ-రికార్డింగ్‌ బాగుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
రొటీన్‌ సినిమాలకు భిన్నంగా కొత్తరకమైన సినిమా తీయాలనే ఈ చిత్రం యూనిట్‌ ప్రయత్నం అభినందీనం. ఇందులో మామూలు కమర్షియల్‌ చిత్రాలకుండాల్సిన హంగులను కొత్తగా చూపించేందుకు ప్రయత్నించారు. మాటలు మామూలుగా, డ్రమెటిక్‌గా లేకుండా సహజంగా ఉన్నాయి. నటీనటుల నటన కూడా సహజంగానే ఉంది. రొటీన్‌ తెలుగు సినిమాకి భిన్నంగా ఈ చిత్రముంది. అందులో ఎలాంటి సమదేహం లేదు. ఇది కొత్త తరహా ఆలోచనా విధానానికి నాంది అనే చెప్పాలి. మొత్తానికి ఇది అద్బుతంగా లేకపోయినా నీచంగా మాత్రం లేదు. ఓసారి చూడొచ్చు.