Read more!

English | Telugu

సినిమా పేరు:శశిరేఖా పరిణయం
బ్యానర్:కార్తికేయ క్రియేషన్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jan 1, 2009
శశిరేఖా పరిణయం అనగానే అచ్చతెలుగు కథ మన కళ్ళముందు కదులుతుంది. పెద్దలు దాన్ని "మాయాబజార్‌" పేరుతో అద్భుతమైన చిత్రంగా మలచి మనకందించారు. మరి ఈ శశిరేఖా పరిణయం కధేంటో ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో గోదావరి జిల్లాకు చెందిన శశిరేఖ (జేనీలియ) అనే అమ్మాయి పెళ్ళి కూతురు అలంకరణతో ఇంట్లోంచి పారిపోతుంది. ఆమె ఎందుకు అలా పారిపోతుందంటే తన తండ్రి (ఆహుతి ప్రసాద్‌) తనతో ఒక్కమాట కూడా చెప్పకుండా తన పెళ్ళిని కుదర్చటం నచ్చక. అలా పారిపోతున్న శశిరేఖకు ఆనంద్‌ ఉఫర్‌ అభిమన్యు (తరుణ్‌) అనుకోకుండా కలసి ఆమెకు అండగా నిలబడతాడు. ఆ తర్వాత విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వరకూ జరిగిన వీరి ప్రయాణంలో వీరి మధ్య ప్రేమ అంకురిస్తుంది. మరి శశిరేఖ పరిణయం ప్రేమించిన వాడితో జరిగిందా...? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ఎనాలసిస్ :
ఒక దర్శకుడిగా కృష్ణవంశీ తానేంటో తన గత చిత్రాల్లోనే నిరూపించాడు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నంతగా సెకెండ్ హాఫ్ బాగుంది ఉంటే ఇది సూపర్ డూపర్ హిట్టయి ఉండేది. సెకెండ్ హాఫ్ లో శశిరేఖ ఆనంద్ ని ప్రేమిస్తుందన్న ప్రేక్షకులకు తెలిసిన విషయాన్నే కొన్ని సీన్ల రూపంలో మళ్ళీ చెప్పటం, నాగార్జున సాగర్ పిక్నిక్ సీన్ల వంటివాటి వల్ల ఈ చిత్రం కొంచెం స్లో అయినట్లనిపిస్తుంది. ఈ చిత్రంలో శశిరేఖ ఇంట్రడక్షన్ సీన్ అదిరింది. మొత్తానికి క్లైమాక్స్ లో మళ్ళీ ఈ చిత్రం మీద ప్రేక్షకులకు సదభిప్రాయం కలిగేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో జెనీలియాకి ‘బొమ్మరిల్లు’లో హాసిని కాస్త గడుసుగా ఉంటే ఎలా ఉంటుందో, అలాంటి పాత్ర లభించటం వల్ల ఆమె నటన నల్లేరు మీద నడకలా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రంలో హీరో జెనీలియా అని చెప్పాలి. శశిరేఖగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక హీరోగా తరుణ్ చేయటానికి పెద్దగా ఏంలేదు. ఆ పాత్రలో ఏ హీరో నటించినా అతనికి వ్యక్తిగతంగా పెద్ద ప్రయోజనం ఉండదు. తరుణ్ ఈ చిత్రంలో తన పాత్రకు న్యాయం చేసి, తాను అన్యాయమైపోయాడని చెప్పాలి. ఇక గోదావరి యాసతో మాట్లాడే భూస్వామి పాత్రలో ఆహుతి ప్రసాద్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. కాకపొతే అతను మాటకు ముందో బూతు, మాటకు చివరో బూతు పెట్టటమే కొద్దిమంది ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే విషయం. ఇలాంటి వాళ్ళు మనకు ఉభయ గోదావరి జిల్లాల్లో చాలామంది కనబడతారు. ఇక పెళ్ళికొడుకు తండ్రిగా పరుచూరి గోపాలకృష్ణ తన స్టైల్లో ఆకట్టుకుంటాడు. ‘మురారి’చిత్రంలో రఘుబాబు వేసిన పాత్రవంటిది సుబ్బరాజు పాత్ర. విచిత్రంగా రఘుబాబు ఈ సినిమాలో చాల డిఫరెంట్ గా అరుపులేమీ లేకుండా నటనే కామెడీగా పండించటం విశేషం. యం.యస్. నారాయణ మండుబాబులను గవర్నమెంట్ టాక్స్ పేయర్స్ గా అభివర్ణించటం మందు బాబులకు బాగా నచ్చే విషయం. మణిశర్మ సంగీతం బాగుంది. రెండు పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చే విధంగా ఉన్నాయి. రీ-రికార్డింగ్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రతి సీనూ హాయిగా చూసే విధంగా చక్కగా ఉంది. నూతన మాటల రచయిత అయిన ఉండ్రమట్ల నాగరాజు మాటలు బాగానే వ్రాశారు. స్త్రీ ఔన్నత్యం గురించి కొన్ని డైలాగులు మనసుకు హత్తుకునేంత ఆర్ద్రపూరితంగా ఉన్నాయి. కాకపొతే ‘ఎఫ్’ అక్షరం మీద వచ్చే కొన్ని మాటలు సెన్సార్ వారు సౌండ్ ని కట్ చేసినా లిప్ మూమెంట్ ని బట్టి ప్రేక్షకులు వాటిని తేలిగ్గానే అర్థం చేసుకోగలరు. అదే కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. తప్పితే ఈ చిత్రంలోని మాటలు బాగున్నాయి. ఈ చిత్రంలో ఇంకా ఓ పది నిమిషాలు ఎడిటింగ్ చేయాల్సిన అవసరం ఉందేమోననిపిస్తుంది. చేసినంత వరకూ ఎడిటింగ్ బాగానే ఉంది. ఈ చిత్రానికి ఆర్ట్ ఫరవాలేదు అనిపిస్తుంది.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమాని సకుటుంబంగా చూసి ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు కృష్ణవంశీ చాలా కష్టపడి తీశాడు. అతను కష్టపడి తీశాడని కాకుండా మీరు ఒక మంచి తెలుగు సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూడండి.