Read more!

English | Telugu

సినిమా పేరు:రుద్రంగి
బ్యానర్:రసమయి ఫిలిమ్స్
Rating:2.50
విడుదలయిన తేది:Jul 7, 2023

సినిమా పేరు: రుద్రంగి
తారాగణం: జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధి, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్.ఎస్. నందా, దివి వడ్త్య (స్పెషల్ అప్పీరెన్స్), రసమయి బాలకిషన్ (స్పెషల్ అప్పీరెన్స్)
మ్యూజిక్: నౌఫల్ గాంధి
సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని
ఎడిటింగ్: బొంతాల నాగేశ్వరరెడ్డి
కాస్ట్యూమ్ డిజైన్: ఆయేషా మరియమ్
నిర్మాత: రసమయి బాలకిషన్  
రచన-దర్శకత్వం: అజయ్ సామ్రాట్
బ్యానర్: రసమయి ఫిలిమ్స్
విడుదల తేదీ: 7 జూలై 2023

'రాజన్న', 'బాహుబలి' సినిమాలకు సంభాషణల రచయితగా పనిచేసిన అజయ్ కుమార్ ఇప్పుడు అజయ్ సామ్రాట్‌గా పేరు మార్చుకొని దర్శకత్వం వహించిన తొలి సినిమా 'రుద్రంగి'. తెలంగాణ నేపథ్యంలో దొరల కాలంనాటి పరిస్థితులు, అప్పటి ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అతను తీసిన ఈ సినిమాలో దొరగా జగపతిబాబు, దొరసానులుగా విమలా రామన్, మమతా మోహన్‌దాస్ నటించగా, తెలంగాణ కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలవడానికి ఒక రోజు ముందే ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్‌లో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు.

కథ
భీంరావ్ దేశ్‌ముఖ్ (జగపతిబాబు)కు మదపిచ్చి ఎక్కువ. భార్య మీరాబాయి (విమలా రామన్) ఉండగానే జ్వాలాబాయి (మమతా మోహన్‌దాస్)ని రెండో భార్యగా గడీకి తీసుకువస్తాడు. భీంరావ్‌పై అతని శత్రువు భుజంగరావు (కాలకేయ ప్రభాకర్) మనుషులు దాడిచేసి చంపాలనుకున్నప్పుడు మల్లేశ్ అనే పిల్లాడు అతడిని కాపాడతాడు. మల్లేశ్‌ను గడీకి తెచ్చి తన అనుచరుడిగా పెంచుతాడు భీంరావ్. 15 యేళ్లు గడుస్తాయి. ఒకసారి అడవిలో రుద్రంగి (గానవి లక్ష్మణ్)ని చూసి, ఆమె అందానికి పిచ్చెక్కినవాడై ఆమెను అనుభవించాలనుకుంటాడు భీంరావ్. అయితే ఆమె తప్పించుకుంటుంది. ఆమెను పట్టి తెచ్చే బాధ్యతను మల్లేశ్ (ఆశిష్ గాంధీ)కి అప్పగిస్తాడు భీంరావ్. రుద్రంగి ఎవరో కాదు, స్వయానా మల్లేశ్ మరదలు.  చిన్నప్పుడే ఆ ఇద్దరికీ వాళ్ల తాత పెళ్లి చేస్తాడు. ఆ వెంటనే ఇద్దరూ భుజంగరావు కారణంగా విడిపోయి ఇప్పుడు కలుస్తారు. ఆమెను తన భార్యగా దొరకు పరిచయం చేస్తాడు మల్లేశ్. రుద్రంగిని ఎలాగైనా పొందాలనుకున్న దొర ఏం చేశాడు? అతని క్రూరత్వానికీ, దౌర్జన్యానికీ రుద్రంగి, మల్లేశ్ బలయ్యారా? మల్లేశ్‌పై కన్నేసిన జ్వాలాబాయి ఏం చేసింది?.. అనే అంశాలు మిగతా కథలో చూస్తాం.


ఎనాలసిస్ :

టైటిల్‌లోని రుద్రంగి పేరుతో ఒక అమ్మాయి పాత్రతో పాటు ఒక ప్రాంతం కూడా ఉంటుంది. మల్లేశ్ ఆ ఊరివాడే. కథను ఎక్కువగా భీంరావ్ దేశ్‌ముఖ్ మదపిచ్చి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం సినిమాకి ఒకింత నష్టం చేకూర్చిందని చెప్పాలి. ఫస్టాఫ్‌లో భీంరావ్ మదపిచ్చితో చేసే పనులు, మల్లేశ్‌పై కన్నేసిన జ్వాలాబాయి అతడిని వశం చేసుకోడానికి తాపత్రయం పడే తీరు ఇబ్బదికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో దొర దాష్టీకానికి రుద్రంగి బలవుతుందేమోననే ఆందోళన మనలో కలిగించడంలో డైరెక్టర్ సఫలీకృతుడయ్యాడు. ఆమె అతడి వాంఛకు బలవకుండా ఉంటే బాగుండునని కోరుకుంటాం. ఈ ఎమోషన్ సినిమాని చాలావరకు కాపాడింది. రుద్రంగి, మల్లేశ్ పడే బాధతో మనం కనెక్టవుతాం. 

దొరల దాష్టీకాలు ఎలా ఉంటాయో దర్శకుడు బాగానే చూపించాడు. అతడు కల్పించిన సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన తీరు ఒక కొత్త దర్శకుడు తీసినట్లుగా కాక, ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసినట్లుగా తోస్తాయి. జగపతిబాబు పాత్రను అపరిమితమైన క్రూరత్వం ఉన్నవాడిగా చిత్రీకరించడం ఓకే కానీ, ఆయనకు పెట్టిన మేనరిజమ్స్ హద్దూ పద్దూ లేకుండా లౌడ్‌గా ఉండటం చికాకు కలిగిస్తుంది. 1940-60 మధ్య కాలం నాటి వాతావరణాన్ని చూపించాలి కాబట్టి బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఎక్కువగా సెట్లోనే సన్నివేశాలను తీశారు. జగపతిబాబు-మమతా మోహన్‌దాస్, జగపతిబాబు-ఆశిష్ గాంధీ, మమత-ఆశిష్ మధ్య సీన్లు ఎఫెక్టివ్‌గా వచ్చాయి. రుద్రంగి క్యారెక్టర్ ప్రేక్షకుల సానుభూతిని సంపాదిస్తుంది.

సినిమాకి సంతోష్ శానమోని సినిమాటోగ్రఫీ ఎస్సెట్. సన్నివేశాల్లోని మూడ్‌ని కెమెరా బాగా పట్టుకుంది. అయితే నౌఫల్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలాచోట్ల లౌడ్‌గా ఉండి సినిమాకి నష్టం కలిగించింది. భీంరావ్ క్యారెక్టర్‌లోని క్రూరత్వాన్ని ఎలివేట్ చేయడానికి బీజీఎంలో మిక్స్ చేసిన వాయిస్ పలుచోట్ల టార్చర్ పెట్టింది. ఆ వాయిస్ లేకపోతే ఒకింత బెటర్‌గా ఆయా సీన్లు పండేవి. నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ ఓకే. ఆయేషా మరియం కాస్ట్యూం డిజైనింగ్ యాప్ట్‌గా ఉంది.

నటీనటుల పనితీరు
సినిమా ప్రధానంగా జగపతిబాబు పోషించిన భీంరావ్ దొర పాత్ర చుట్టూ నడుస్తుంది. ఆ పాత్రలో జగపతిబాబు అవసరానికి మించి విజృంభించి నటించాడు. ఆయన మేనరిజమ్స్ ఓవర్ ద బోర్డ్ వెళ్లాయి. చాలా కాలం తర్వాత వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలనే తపన ఆయన నటనలో కనిపించింది. మమతా మోహన్‌దాస్ ఈ సినిమాకి ఒక ఎస్సెట్. ఫెరోషియస్ జ్వాలాబాయి పాత్రలో గొప్పగా రాణించింది. సాత్వికమైన మీరాబాయిగా విమలా రామన్ తన అభినయంతో ఆకట్టుకుంది. రుద్రంగిగా కన్నడ తార గానవి లక్ష్మణ్ చక్కగా చేయగా, రుద్రంగిని ప్రాణప్రదంగా ప్రేమించే మల్లేశ్ పాత్రలో ఆశిష్ గాంధి అపూర్వంగా రాణించాడు. అతనికి ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి పాత్రలు వస్తాయని నమ్మొచ్చు. కన్నింగ్ కరణం క్యారెక్టర్‌లో ఆర్.ఎస్. నందా సరిగ్గా సరిపోయాడు. భుజంగరావు పాత్రలో కాలకేయ ప్రభాకర్ కూడా ఇట్టే ఇమిడిపోయాడు. నిర్మాత రసమయి బాలకిషన్ ఒక ఉద్వేగభరిత ఫోక్ సాంగ్‌లోనూ, నటి దివి వడ్త్య మరో ఐటం సాంగ్‌లోనూ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

భీంరావ్ దొర పాత్రను ఎక్కువగా మదపిచ్చి ఉన్నవాడిగా ఎలివేట్ చేసి, దానిచుట్టూనే కథ నడపడం సినిమాకి నష్టం చేకూర్చింది. సెకండాఫ్‌లో భావోద్వేగపూరిత సన్నివేశాలు, సానుభూతికి నోచుకొనే సన్నివేశాల వల్ల ఆ నష్టాన్ని దర్శకుడు కొంతమేర పూడ్చగలిగాడు. అయితే ఒకప్పటి కాలాన్ని ప్రతిబింబించే పాత్రలు, ఆ పాత్రల్లో ఆయా నటుల అభినయాన్ని ఆస్వాదించడం కోసమైనా 'రుద్రంగి'ని ఒకసారి చూడాలి.

- బుద్ధి యజ్ఞమూర్తి