Read more!

English | Telugu

సినిమా పేరు:నాన్న
బ్యానర్:వెల్ ఫేర్ క్రియేషన్స్, యస్.కె.స్టుడియోస్
Rating:3.00
విడుదలయిన తేది:Jul 15, 2011

కథ - సంఘసేవ చేసే భానుమతి అనే ఒక కోటీశ్వరుడి కూతురు ఒక మానసిక వికలాంగుడు కృష్ణ (విక్రమ్) ని ప్రేమించి పెళ్ళి చేసుకుని, వెన్నెల (బేబీ సారా) అనే బిడ్డను కని చనిపోతుంది. ఇదంతా మనకు వినిపిస్తుంది కానీ కనిపించదు. ఊటీలో తాను ఒక చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ ఆ పిల్లను పెంచుతూ, స్కూల్ కి పంపించి చదివిస్తుంటాడు కృష్ణ. ఆ స్కూల్ కరస్పాండెంట్ శ్వేత (అమల పాల్) నిజానికి భానుమతి చెల్లెలు. వెన్నెల తన అక్క కూతురన్న సంగతి తెలియగానే తన తండ్రికి ఈ విషయం చెపుతుంది. అలాగే ఆమె ప్రియుడు (కార్తీక్ కుమార్) కూడా కృష్ణను బయటకు తరిమి వెన్నెలను తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ శ్వేత తండ్రి వచ్చి వీళ్ళని తిట్టి, కృష్ణను, వెన్నెలను కూడా కారులో విశాఖపట్టణం తీసుకెళుతుంటాడు. కానీ విశాఖపట్టణానికి 30 కి.మీ. దూరంలో కృష్ణను కారులోంచి మోసంతో దించేసి, వెన్నెలను తీసుకుని వెళ్ళిపోతాడతను.మానసికంగా ఆరేళ్ళ పిల్లాడి స్థితిలో ఉన్న కృష్ణ, కోటీశ్వరుడైన తన మామను ఎదుర్కొని తన కూతుర్ని దక్కించుకున్నాడా...? లేదా అన్నది మిగిలిన కథ.


ఎనాలసిస్ :

విశ్లేషణ - దాదాపు మూడు గంటల సినిమాని పెద్దగా బోరుకొట్టకుండా తీసినందుకు ఈ చిత్ర దర్శకుడు విజయ్ ని అభినందించాలి. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ప్రాణం. అసలు ఇలాంటి కథను తీయటానికి ఎంచుకోవటం ఒక సాహసం, దాన్ని ఆసక్తికరంగా మలచటం అనేది మరొక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ని దర్శకుడు విజయ్ చాలా చక్కగా ఎదుర్కొన్నాడు....విజయం సాధించాడు. ఒక దర్శకత్వపు విలువలు చాలా బాగున్నాయి. ఈ సినిమా తీసిన నిర్మాతలు తమ ఉత్తమాభిరుచిని కూడా మెచ్చుకోవాలి. ఎటువంటి అసభ్యత, అశ్లీలత లేకుండా, అలాగే ఎలాంటి సగటు సినిమా కమర్షియల్ సూత్రాలను పాటించకుండా కూడా ఒక మంచి సినిమా తీయవచ్చని ఈ చిత్ర నిర్మాతలు ఈ "నాన్న" చిత్రం ద్వారా నిరూపించారు. కానీ హృదయానికి హత్తుకునే ఈ మంచి సినిమాని మాస్ ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారో వేచి చూడాలి.

నటన - విక్రమ్ ఇప్పటికే రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యాడు. ఈ చిత్రంతో మరోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అతని నటనలో ఆ స్థాయి మనకు కనపడుతుంది. అనుష్క, అమల పాల్, సంతానం, నాజర్ ఇలా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బేబీ సారా నటన కూడా ఆకట్టుకుంటుంది.

సంగీతం- ఆహా...ఒహో అనే రేంజ్ లో లేకపోయినా బాగుంది. రీ-రికార్డింగ్ కూడా బాగుంది.

సినిమాటోగ్రఫీ - బాగుంది. కళ్ళకి ఏ మాత్రం శ్రమ లేకుండా హాయిగా ఈ సినిమా చూసే విధంగా ఉంది.

మాటలు - చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు ఎలా వ్రాస్తే బాగుంటాయో మాటలు అలానే ఉన్నాయి.

పాటలు - ఒ.కె.

ఎడిటింగ్ - చక్కగా ఉంది.

ఆర్ట్ - ఆర్ట్ కూడా బాగుంది.

కొరియోగ్రఫీ - పిచ్చి గంతులు లేవు...పాటను బట్టి చక్కని కొరియోగ్రఫీని మనం ఈ సినిమాలో చూడవచ్చు.

యాక్షన్ - చాలా సహజంగా ఉంది.


తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

మీకు స్టెప్పులు కావాలన్నా... ద్వందర్థాల మాటలు కావాలన్నా... అర్థం పర్థం లేని పిచ్చి గంతులు...హీరో ఎడంచేత్తో కొడితే పదిమంది ఎగిరి పడేటువంటి ఫైట్లు కావాలంటే ఈ "నాన్న" సినిమాని దయచేసి చూడకండి. మీకు మనసుంటే...మీ పిల్లలను మీరు ప్రేమించే మనిషి అయితే, ముఖ్యంగా మీకు గనక ఒక కూతురుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి.