Read more!

English | Telugu

సినిమా పేరు:నచ్చావులే
బ్యానర్:ఉషాకిరణ్ మూవీస్
Rating:3.00
విడుదలయిన తేది:Dec 19, 2008
ఈ చిత్రం ఒక బెంగాలీ అమ్మాయికీ, ఈస్ట్‌ గోదావరి అబ్బాయికీ పుట్టిన ఒక పిల్లాడి మనసులోని భావాలతో మొదలవుతుంది. ఆ పిల్లాడి పేరు లవ్‌కుమార్‌. అతని తల్లి "మన మనసులో ఏదన్నా బలంగా ఆ దైవాన్ని కోరుకుంటే ఆ దేవుడు ఆ సంకల్పాన్ని నిజం చేస్తాడు'' అని ఆ పిల్లాడికి చెపుతుంది. వాడికి చిన్నప్పటి నుంచీ ఆడపిల్లలతో స్నేహం చేయాలని ఉంటుంది. టీనేజ్‌ కొచ్ఛాక ఆ భావం వయసుతో పాటు మరింత బలంగా పెరుగుతుంది. అతనికి ఒక స్నేహితుడుంటాడు. వాడి సాయంతో కనిపించిన అమ్మాయికల్లా సైట్‌ కొడుతూ, వాళ్ళ చేతుల్లో తన్నులు తింటూ ఉంటాడు. ఒక రోజు తన తమ్ముడు చెట్టుకున్న ఒకే మామిడి పండుని పట్టువదలకుండా రాళ్ళతో కొట్టి ఆ పండుని కిందపడేలా చేయటం చూసిన లవ్‌కుమార్‌ తాను కూడా అలాగే ఒకే అమ్మాయికి సైట్‌ కొట్టాలనుకుంటాడు. ఆ దిశలో అను అనే ఒకమ్మాయిని సెలెక్ట్‌ చేసుకుని సైట్‌కొడుతుంటే ఆ అమ్మాయి అతనికి రెస్పాన్స్‌ ఇవ్వదు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి తండ్రికి గుండెపోటు వస్తే లవ్‌కుమార్‌ అతని ఫ్రెండ్‌ కలసి అతన్ని హాస్పిటల్లో సమయానికి చేరుస్తారు. దాంతో తన తండ్రిని కాపాడినందుకు అతని రుణం తీర్చుకోలేనంటుంది. తనకు గర్ల్‌ఫ్రెండ్‌గా వుండి రుణం తీర్చుకోమంటాడు లవ్‌కుమార్‌. కానీ అందుకా అమ్మాయి తన చేతులు పట్టుకోకూడదని, తనను కౌగిలించుకోకూడదనీ, ముద్దుపెట్టుకోకూడదనీ ఇలా మూడు కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్లకు ఒప్పుకునే లవ్‌కుమార్‌ ఆమెతో స్నేహం చేస్తాడు. కానీ అనుకోకుండా ఆ మూడు కండిషన్లను ఆ అమ్మాయే అతిక్రమిస్తుంది. ఒకసారి లవ్‌కుమార్‌ని అను ముద్దు పెట్టుకుంటుండగా అనుకోకుండా అది తన సెట్‌ఫోన్‌ ద్వారా లవ్‌కుమార్‌ వీడియో తీస్తాడు. కానీ ఆ విషయం లవ్‌కుమార్‌కి కూడా తెలీదు. లవ్‌కుమార్‌ తమ్ముడు బంటి లవ్‌కుమార్‌ సెల్‌ఫోన్‌ని వేరే వాళ్ళకి అమ్మేయటంతో ఆ సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ముద్దు సీన్‌ యమ్‌.యమ్‌.యస్‌.ల ద్వారా అందరికీ తెలిపోతుంది. ఆ తర్వాత తనను గతంలో పరాభవించి అమ్మాయిలకు అనుని చూపిస్తూ ఫోజ్‌ కొడుతుంటాడు లవ్‌కుమార్‌. అలా చాలా మంది అమ్మాయిలను తన చుట్టూ తిప్పుకుంటూ చిన్ననాటి తన కోరికను తీర్చుకుంటాడు లవ్‌కుమార్‌. ఈ దిశలో అనును నిర్లక్ష్యం చేస్తాడు. ముద్దు సీన్‌ యమ్‌.యమ్‌.యస్‌.ల వల్ల అను మనసు చాలా గాయపడుతుంది. దానివల్ల కాలేజీలో సీటు కూడా ఇవ్వరు. అందరూ ఆమెను అదోలా ఒక చెడిపోయిన దానిలా చూస్తుంటారు. తన తల్లి తనతో చెప్పిన మాటల ప్రభావంతో, అనుని తిరిగి పొందాలని తాపత్రయపడగా, అందుకు అను తిరస్కరించి, ఆ ఊరు వదిలి వెళ్ళిపోటానికి బయలు దేరుతుంది. తర్వాతేమయిందనేది మిగిలిన కథ...
ఎనాలసిస్ :
సినిమా ఫస్ట్‌ హఫ్‌ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో గడచిపోతుంది. ఈ సినిమాలో వెరైటీ కామెడీ కావల్సినంత ఉంది. సెకండ్‌ హాఫ్‌లో మనసులకు హత్తుకునే చక్కని సెంటిమెంట్‌తో ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా తనదైన ముద్రతో రవిబాబు మలిచాడు. ముఖ్యంగా ఈ చిత్రం స్ర్కీన్‌ప్లే వర్థమాన దర్శకులకు ఒక పాఠంలా ఉంటుంది. అంతబాగుందీ చిత్రం స్ర్కీన్‌ప్లే. ఈ చిత్రంలో రవిబాబు మాటలు కూడా వ్రాయటం విశేషం. ఈ సినిమాలో మాటలు చాలా బాగున్నాయని చెప్పాలి. "పైనున్న దాన్ని పైనాపిల్‌ అన్నప్పుడు కిందున్న దాన్ని కిందాపిల్‌ అనేకదా అంటారు'' వంటి మాటలు మనల్ని బాగానే ఆకట్టుకుంటాయి. పద్మావతి అనేపాటలో సగటు టీనేజ్‌బోయ్స్‌ ఫీలింగ్స్‌ని, వారి బాధలని చక్కగా చూపించాడు దర్శకుడు. నటన:- బాలనటుడిగా అనేక చిత్రాల్లో, పెద్ద పెద్ద స్టార్లతో, అగ్ర దర్శకుల వద్ద నటించిన సాయిశుభాకర్‌ ఈ చిత్రంలో హీరోగా నటింగా నటించాడు. టీనేజ్‌ బోయ్‌గా అతని అల్లరి, ట్రాజెడీ సీన్లలో అతని నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ కొత్తమ్మాయి అయినా, పెద్ద అందగత్తె కాకపోయినా, ఆమె నటన మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. మన పక్కింటి అమ్మాయిలా ఆమె ఈ చిత్రంలో కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. సంగీతం:- బాగుంది. ఫస్ట్‌ సాంగ్‌ "పద్మావతి'' అనే పాట, టైటిల్‌ సాంగ్‌ బాగున్నాయి. రీ-రికార్డింగ్‌ బాగుంది. ఈ చిత్రంలోని పాటల సాహిత్యం, చిత్రీకరణ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ:- బాగుంది. చూడముచ్చటగా ఈ చిత్రాన్ని మనకందించటంలో కెమేరామేన్‌ సఫలీకృతుడయ్యాడు. ఎడిటింగ్:- నీట్‌గా వుంది. ఆర్ట్‌: ఈ సినిమాలో ఏది సెట్లో... ఏది నిజమైన లొకేషనో కనిపెట్టటం చాలా కష్టం. ఆర్ట్‌ పనితనం అలా ఉంది. యాక్షన్‌ :- ఒ.కే.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఈ సినిమాని అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్‌ చెయ్యొచ్చు.